కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జైళ్లలోని ఖైదీలను విడుదల చేస్తున్నాయి ప్రభుత్వాలు. అయితే.. జైలు గోడలే తమకు శ్రీరామ రక్ష అంటున్నారు గుజరాత్‌కు చెందిన ఇద్దరు ఖైదీలు. బయటకు వెళ్లేందుకు అనుమతించినా.. ఇక్కడే ఉంటామని పట్టుబడుతున్నారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏడేళ్ల కంటే తక్కువ శిక్షను అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేయాలని దిగువ కోర్టులను ఆదేశించింది సుప్రీం కోర్టు. ఈ మేరకు.. నర్మదా జిల్లా, రాజ్పీప్లా కారాగారాల్లో శిక్ష అనుభవిస్తున్న 177 మందిలో 22 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించింది స్థానిక కోర్టు.
విడుదలైన 20 మంది ఇంటికి వెళ్తున్నామని ఆనందంగా ఎగిరి గంతేస్తే.. ఓ ఇద్దరు ఖైదీలు మాత్రం దిగులు చెందారు. బయటికెళ్లి కరోనా బారినపడడం కంటే, అక్కడే సురక్షితంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. జైలు గోడలే వైరస్ నుంచి కాపాడే రక్షక కవచాలని దృఢంగా నమ్మారు. వారిద్దరినీ జైల్లోనే ఉండేందుకు అనుమతివ్వాలంటూ కోర్టును ఆశ్రయించారు.
ఇదీ చదవండి:కడుపున బిడ్డను మోస్తూ.. 142కి.మీ కాలినడక