దేశ ప్రజలకు నూతన సంవత్సరం బహుమతి ఇవ్వడానికి కేంద్రం సిద్ధమైంది. భారత్లోనే తొలి సారిగా ఆటోమేటెడ్ డ్రైవర్ రహిత రైలుకు ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపనున్నారు. డిసెంబర్ 28న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీనిని ప్రారంభించనున్నట్లు.. దిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్(డీఎంఆర్సీ) స్పష్టం చేసింది. ఇదొక పెద్ద సాంకేతిక విజయమని పేర్కొంది.
''దేశంలోనే తొలి డ్రైవర్ రహిత రైలును పీఎం నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. దీనిని మాగెంటా లైన్లో భాగంగా పశ్చిమ జానక్పురి నుంచి బొటానికల్ గార్డెన్ వరకు ఈ రైలు ప్రయాణించనుంది. దీని పొడవు 37 కి.మీ.లు. దీంతో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం పూర్తి స్థాయిలో పనిచేసే నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు(ఎన్సీఎంసీ)ను ప్రారంభిస్తారు. ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ లైన్లో భాగంగా న్యూ దిల్లీ నుంచి ద్వారకా సెక్టార్ 21 వరకు ఉన్న 23 కి.మీ.ల వరకు ఇది పనిచేస్తుంది.''
- దిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్.
దిల్లీ మెట్రోలోని పది కారిడార్లలో ఎన్సీఎంసీ మొదటిసారిగా వినియోగంలోకి రానుంది. 'వన్ నేషన్-వన్ కార్డ్' నినాదంలో భాగంగా దీనిని 2019 మార్చిలో మోదీ ప్రారంభించారు.
ఆరు స్టేషన్లతో మొదలు..
2002 డిసెంబర్ 25న అప్పటి ప్రధాని వాజ్పేయీ దిల్లీ మెట్రోను ప్రారంభించారు. మొదట 6 స్టేషన్లతో 8.2 కి.మీ.ల పొడవుతో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం డీఎంఆర్సీకి 242 స్టేషన్లు ఉన్నాయి. రోజుకు 26 లక్షల ప్రజలు దిల్లీ మెట్రో ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు.
ఇదీ చదవండి: పెళ్లి కోసం ప్రధాని మోదీ సంతకం ఫోర్జరీ