కరోనాపై పోరాటంలో వైద్యులకు కేంద్రప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని స్పష్టంచేశారు ప్రధాని నరేంద్ర మోదీ. మన్‌కీ బాత్‌లో భాగంగా పలువురు వైద్యులతో ఫోన్లో సంభాషించారు. కరోనాతో యావత్ దేశం యుద్ధం చేస్తున్న సమయంలో వైద్యులందరూ సైనికుల్లాగా పోరాడుతున్నారని కొనియాడారు. రోగులకు వైద్యంతో పాటు మనోధైర్యాన్ని నింపేలా.. కౌన్సెలింగ్ కూడా ఇవ్వాలని డాక్టర్లకు సూచించారు ప్రధాని.
డాక్టర్ నితీశ్ గుప్తాతో
దిల్లీకి చెందిన డాక్టర్ నితీశ్ గుప్తాతో ఫోన్లో మాట్లాడారు మోదీ. ఈ సందర్భంగా.. ఇతర దేశాల్లో పెరుగుతున్న మృతుల సంఖ్యను చూసి చాలా మంది భయపడుతున్నారని, ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని ప్రధానికి వివరించారు డాక్టర్ గుప్తా.
డాక్టర్ బోర్సే
పుణెలోని బీజే వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బోర్సేతోనూ ముచ్చటించారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా కరోనా అంత ప్రమాదకర వ్యాధి కాదని.. తన ఆసుపత్రిలోని రోగులందరూ కోలుకుంటున్నట్లు మోదీకి వివరించారు బోర్సే. స్వీయ నిర్బంధంలో ఉన్నవారికి పలు సూచనలు చేశారు డాక్టర్ బోర్సే.
- స్వీయ నిర్బంధంలో ఉన్నవారు మొదటగా ఇతరుల నుంచి ఆరడుగుల దూరం పాటించాలి.
- రెండోది నిర్బంధంలో ఉన్నవారు మాస్క్‌లు ధరించాలి. తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర శానిటైజర్ లేకుంటే.. సబ్బుతోనే పదేపదే చేతులు కడుక్కోండి.
- తుమ్ము వచ్చినా, దగ్గు వచ్చినా చేతిరుమాలు వినియోగించండి.