కరోనా కట్టడికి కేంద్రప్రభుత్వం చేపట్టిన చర్యలను పార్లమెంటరీ ప్యానెళ్లు పరిశీలిస్తున్నట్టు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వెల్లడించారు. అయితే వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఇంత తక్కువ వ్యవధిలో స్టాండింగ్ కమిటీ సమావేశాలను నిర్వహించడం కూడా కుదిరేది కాదన్నారు. ఈ మేరకు తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు వెంకయ్య.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించడంపై చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు ఉపరాష్ట్రపతి. పార్లమెంటరీ కమిటీల భేటీలపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో మాట్లాడినట్టు పేర్కొన్నారు.
"కరోనా నియంత్రణకు ప్రవేశపెట్టిన భౌతిక దూరం నిబంధనను పాటిస్తూ.. పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు పాల్గొనాలి అంటే ఎంతో ఆలోచించాల్సిన విషయం. సరైన ప్రణాళిక కూడా ఉండాలి. వర్షాకాల సమావేశాల నిర్వహించాలని ప్రభుత్వం కూడా కోరింది. ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేలా చర్యలు చేపడతాం."
--- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి.
ఆన్లైన్ వేదికగా సమావేశాలు జరపాలని పలువురు విజ్ఞప్తి చేసినప్పటికీ.. స్టాండింగ్ కమిటీలు ఇప్పటివరకు నాలుగుసార్లు భౌతికంగానే భేటీ అయ్యాయి.
కరోనా మహమ్మారి కారణంగా బడ్జెట్ సమావేశాలు ఈ ఏడాది మార్చి 23న అర్థంతరంగా నిలిచిపోయాయి.
ఇదీ చూడండి:- 'ఒక తరగతి-ఒక ఛానల్ దిశగా కేంద్రం సన్నాహాలు'