ఉగ్రవాదులపై సైన్యం, పోలీసుల దూకుడు కొనసాగుతోంది. సరిగ్గా పది రోజుల క్రితం హిజ్బుల్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్ రిజాజ్ నైకూను సైన్యం మట్టుబెట్టగా.. తాజాగా జమ్ము కశ్మీర్లోని అరిజాల్ ఖాన్సాహిబ్, బుద్గామ్ ప్రాంతాల్లో ముష్కరులు నక్కిన ఓ స్థావరాన్ని జమ్ము కశ్మీర్ పోలీసులు గుర్తించారు.
రహస్య స్థావరంలో దాక్కున్న లష్కరే తొయిబాకు చెందిన అత్యున్నత కార్యదళ సభ్యుడు 'జహూర్ వనీ'ని అరెస్టు చేసినట్లు జమ్ము కశ్మీర్ పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
మరో నలుగురు
అనంతరం విచారణలో అందిన సమాచారంతో ఉగ్రవాదులతో సంబంధం ఉన్న మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు జమ్ము కశ్మీర్ పోలీసులు తెలిపారు. వీరంతా ఖాన్సాహిబ్ ప్రాంతానికి చెందినవారేనని స్పష్టం చేశారు. లష్కరే తొయిబా ఉగ్రవాదులకు వీరు ఆశ్రయం కల్పిస్తున్నట్లు చెప్పారు. గత కొద్ది నెలలుగా ముష్కరులు ఈ ప్రాంతంలో చురుకుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు.