దేశంలోని అన్ని భాషలకు సమాన గౌరవం కల్పించాలని పిలుపునిచ్చారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. అదే సమయంలో ఏ భాషను బలవంతగా రుద్దటం కానీ, వ్యతిరేకించటం కానీ చేయకూడదని అభిప్రాయపడ్డారు. ఆన్లైన్ వేదికగా జరిగిన 'హిందీ దివాస్-2020' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశంలోని అన్ని భాషలు మహోన్నతమైన చరిత్రను కలిగి ఉన్నాయని, దేశ భాషల వైవిధ్యం, సాంస్కృతిక వారసత్వాన్ని చూసి ప్రజలంతా గర్వపడాలన్నారు. 1918లో మహాత్మగాంధీ దక్షిణ భారత హిందీ ప్రచార సభను స్థాపించినట్లు గుర్తు చేశారు. హిందీని భారతీయ భాషలతో సమానంగా చూడాలని నొక్కి చెప్పారు.
హిందీయేతర రాష్ట్రాల విద్యార్ధులు హిందీని నేర్చుకోవాలని, అలాగే హిందీ మాట్లాడే వారు ఇతర పౌరులపై ప్రేమ, వాత్సల్యం, సాన్నిహిత్యం పెంపొందించుకోవటం కోసం తెలుగు, తమిళం, కన్నడ వంటి భాషలను నేర్చుకోవాలని సూచించారు.
నూతన విద్యా విధానం 2020లో మాతృభాషకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపిన ఉపరాష్ట్రపతి.. సంఘటిత అభ్యాసానికి మాతృభాషలోనే విద్యను అందించాలని పిలుపునిచ్చారు. దీని వల్ల విద్యార్థులు ఏదైన విషయాన్ని సులువుగా అర్థం చేసుకోవటానికి, చదవటానికి దోహదపడుతుందని అన్నారు.
మాతృభాషలోనే విద్య అభ్యసించాలంటే హిందీ, ఇతర భారతీయ భాషలలో మంచి పుస్తకాలు అవసరమవుతాయన్నారు వెంకయ్య. దీనిలో ప్రచురణ సంస్థలదే ముఖ్యమైన పాత్ర అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారతీయ భాషలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతో ఉందని వెల్లడించారు. ఇందుకోసం ప్రచురణకర్తలు, విద్యావేత్తలు భాషల మధ్య సమన్వయాన్ని పెంచడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.