కర్ణాటకలోని బెంగళూరులో దోపిడీకి పాల్పడ్డ దొంగల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. వారంతా కొలంబియాకు చెందిన వారని గుర్తించారు. నిందితులను విలియం పాడిల్లా మార్టినెజ్, స్టెఫానీ మునోజ్ మోన్సాల్వే, క్రిస్టియన్ ఐనేజ్ ఒలార్టోగా పేర్కొన్నారు. వీరు బెంగళూరులోని 30కి పైగా ఇళ్లలో చోరీకి పాల్పడినట్లు స్పష్టం చేశారు.
ఈ దోపిడీ ముఠా.. అపార్ట్మెంట్లు లక్ష్యంగా చేసుకొని భారీ మొత్తంలో నగదు, బంగారం దోచుకుంటోందని వెల్లడించారు పోలీసులు.
దోపిడి ఇలా..
వీరు దొంగతనం చేసే విధానం కూడా ప్రత్యేకంగా ఉందని తెలిపారు పోలీసు అధికారులు. ఇటీవల ఓ ఫ్లాట్లో ఈ ముఠా దొంగతనానికి పాల్పడిన సీసీటీవీ పుటేజీని పరిశీలించి విస్తుపోయారు. చోరీలో భాగంగా 15 అడుగుల ఎత్తైన గోడను కూడా అలవోకగా దూకి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు నిర్ధరించారు. ఇందుకోసం.. ఈ దుండగులు ప్రత్యేక శిక్షణ పొందారని చెప్పారు. నిందితుల నుంచి కారు, వాకీ-టాకీ, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
గతంలోనూ..
జూన్ మొదటి వారంలోనే దేశానికి వచ్చిన ఐదుగురు కొలంబియన్లను అరెస్ట్ చేశామన్న అధికారులు.. వారిపై విచారణ జరుగుతోందని తెలిపారు.
ఇదీ చదవండి: కల్తీ మద్యం కాటుకు 21 మంది బలి