కాంగ్రెస్లో నాయకత్వ సమస్యపై అభిప్రాయబేధాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పార్టీలో సంస్థాగత మార్పులకు బాటలు పరచాలని చెబుతూనే.. నాయకత్వంపైనా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ 23 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియాకు లేఖ రాశారు. ఈ విషయంలో అసమ్మతి స్వరం వినిపించిన నేతల పట్ల కాంగ్రెస్ వ్యవహరించిన తీరుపై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై రాజకీయ విశ్లేషకులు నీర్జా చౌదరి, సీనియర్ జర్నలిస్ట్ వినోద్ శర్మ ఈటీవీ భారత్తో ప్రత్యేకంగా మాట్లాడారు. కాంగ్రెస్లో నెలకొన్న అనిశ్చితిపై చర్చించారు.
"23 మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు సంస్థాగత మార్పులు కోరుకుంటూ లేఖ రాశారు. దీనిపై పార్టీ స్పందన చూస్తే అసమ్మతి స్వరం వినిపిస్తున్న వారి పట్ల ఏ విధంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది. సోనియా, రాహుల్ లేకుంటే కాంగ్రెస్ చుక్కాని కోల్పోతుంది. సమస్య కాంగ్రెస్ పార్టీ గురించి కాదు. భారత పార్లమెంటరీ వ్యవస్థలో ప్రతిపక్షం గురించి."
-నీర్జా చౌదరి, రాజకీయ విశ్లేషకులు
లేఖ రాసిన నేతలపై గాంధీ కుటుంబ విధేయులు తీవ్రంగా విరుచుకుపడ్డారని వినోద్ శర్మ పేర్కొన్నారు. కాంగ్రెస్ వ్యవహారశైలి వల్లే రోజురోజుకూ పార్టీలో ఘర్షణలు పెరిగిపోతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.