కరోనా మహమ్మారి విజృంభిస్తున్న క్రమంలో వైరస్ నిర్ధరణకు పలు పరీక్షలు చేపడుతున్నారు. అయితే.. దేశీయ తొలి సీఆర్ఐఎస్పీఆర్(క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్) కొవిడ్-19 టెస్ట్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది టాటా గ్రూప్. దీనిని దేశంలో వినియోగించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతులు ఇచ్చినట్లు తెలిపింది. ఈ కరోనా నిర్ధరణ పరీక్షను.. టాటా గ్రూప్, సీఎస్ఐఆర్-ఐజీఐబీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
ఈ పరీక్షలో సార్స్-కోవ్-2 వైరస్ జన్యుక్రమాన్ని గుర్తించేందుకు సీఆర్ఐఎస్పీఆర్ సాంకేతికతను దేశీయంగా రూపొందించినట్లు టాటాసన్స్ ప్రకటించింది. ఇది ప్రపంచంలోనే తొలిసారి ప్రత్యేక కాస్-9 ప్రోటీన్‌ను ప్రవేశపెట్టే పరీక్షగా పేర్కొంది సంస్థ. అలాగే.. సంప్రదాయ ఆర్టీ-పీసీఆర్ పరీక్షల కచ్చితత్వ స్థాయులను చేరుకుంటుందని, సత్వర ఫలితాలు, కనిష్ఠ ధర, సులభంగా వినియోగించేలా ఉంటుందని పేర్కొంది. అంతేకాకుండా, సీఆర్ఐఎస్పీఆర్ అనేది భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానం, ఇది భవిష్యత్తులో అనేక ఇతర వ్యాధికారక క్రిములను గుర్తించడానికి కూడా ఉపయోగపడనుందని తెలిపింది.
" టాటా సీఆర్ఐఎస్పీఆర్ కరోనా టెస్ట్‌కు అనుమతులు రావటం.. దేశ కరోనా కట్టిడి ప్రయత్నాలకు మరింత బలం చేకూరినట్లయింది. ఇది దేశీయ శాస్త్రవేత్తలు, నిపుణుల ప్రతిభను ప్రతిబింబిస్తోంది. అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులు, శాస్త్రవేత్తలకు భారత సహకారాన్ని అందించేందుకు ఉపయోగపడుతుంది."
- గిరీష్ క్రిష్ణమూర్తి, టాటా మెడికల్, డయగ్నోస్టిక్స్ సీఈఓ.
దేశీయంగా ఒక సురక్షితమైన, నమ్మకమైన, సరసమైన, సులభరీతిలో ఒక ఉన్నతమైన పరీక్ష సాంకేతికతను రూపొందించేందుకు.. సీఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయోలజీ, భారతీయ వైద్య పరిశోధన మండలితో కలిసి పనిచేసింది టాటా గ్రూప్.
ఇదీ చూడండి: వచ్చేవారమే 'ఆక్స్ఫర్డ్' మూడోదశ క్లినికల్ ట్రయల్స్