ప్రపంచ సగటుతో పోలిస్తే కరోనా మరణాల రేటు భారత్లో అత్యల్పంగా నమోదైంది. లక్ష మంది జనాభాకు 0.2 మరణాలు(10 లక్షల మందికి ఇద్దరు) సంభవించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ సంఖ్య 4.1గా ఉంది.
దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,01,139కు చేరగా.. 3,163 మంది మరణించారు. 39,173 మంది కోలుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక-119 ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా 3,11,847 మంది కరోనా బారిన పడి మృతి చెందారు.
దేశాల వారీగా చూస్తే..
దేశం | మరణాల సంఖ్య | లక్ష జనాభాకు |
అమెరికా | 87,180 | 26.6 |
బ్రిటన్ | 34,636 | 52.1 |
ఇటలీ | 31,908 | 52.8 |
ఫ్రాన్స్ | 28,059 | 41.9 |
స్పెయిన్ | 27,650 | 59.2 |
జర్మనీ | 7,935 | 9.6 |
ఇరాన్ | 6,988 | 8.5 |
కెనడా | 5,702 | 15.4 |
నెదర్లాండ్స్ | 5,680 | 33 |
మెక్సికో | 5,045 | 4 |
చైనా | 4,645 | 0.3 |
ప్రభుత్వ చర్యలతోనే..
దేశంలో మరణాలు రేటు తక్కువగా ఉండటానికి కారణం సమయానికి తగినట్లు ప్రభుత్వం తీసుకున్న చర్యలేనని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కాంటాక్ట్ ట్రేసింగ్, సత్వర చికిత్సతో మరణాలను నిలువరించగలిగామని పేర్కొంది.
రికార్డు స్థాయిలో పరీక్షలు..
భారత్ చాలా వేగంగా నిర్ధరణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచుకున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. 385 ప్రభుత్వ, 158 ప్రైవేటు ల్యాబొరేటరీల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది. దేశంలో సోమవారం రికార్డు స్థాయిలో 1,08,233 శాంపిళ్లను పరీక్షించినట్లు వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 24,25,742 నిర్ధరణ పరీక్షలు చేశామని వివరించింది.
ఆర్టీ-పీసీఆర్తో పాటు ట్రూఎన్ఏటీ, సీబీఎన్ఏఏటీ వంటి యంత్రాలతోనూ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. 14 ఎయిమ్స్ తరహా సంస్థలు ల్యాబొరేటరీల్లోని భద్రతా ప్రమాణాలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పరీక్ష కిట్ల సరఫరా కోసం 15 డిపోలను ఏర్పాటు చేశామన్నారు.
ఇదీ చూడండి: లాక్డౌన్ 4.0: బస్సులు రయ్రయ్- సెలూన్లు హౌస్ఫుల్