చెన్నైలోని ఓ ప్రముఖ బులియన్ ట్రేడింగ్ సంస్థ ప్రాంగణాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. సుమారు రూ.500 కోట్లకుపైగా లెక్కించని ఆదాయాన్ని గుర్తించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) గురువారం తెలిపింది.
చెన్నై, ముంబయి, కోల్‌కతా, కోయంబత్తూర్, సేలం, తిరుచ్చి, మధురై, తిరునెల్వెలీలోని సంస్థ ప్రాంగణాల్లో తనిఖీలు నిర్వహించింది ఆదాయ పన్ను శాఖ.
" ఇప్పటి వరకు నిర్వహించిన తనిఖీల్లో రూ.500 కోట్లకుపైగా లెక్కించని ఆదాయాన్ని గుర్తించాం. అందులో రూ.150 కోట్ల వరకు ఆ సంస్థే స్వచ్ఛందంగా వెల్లడించింది. డీలర్ గ్రూప్ వ్యాపారేతర పెట్టుబడులు సహా, లాభాలను తగ్గించేందుకు వసతుల పేరిట బిల్లులు రూపొందించటంపైనా దర్యాప్తు కొనసాగుతోంది."
- ఆదాయ పన్ను శాఖ.
సుమారు రూ.400 కోట్ల విలువైన 814 కిలోల అదనపు స్టాక్‌ను గుర్తించినట్లు తెలిపింది సీబీడీటీ. వాటిని కూడా పన్ను పరిధిలోకి తీసుకువస్తామని ప్రకటించింది. సంస్థకు సంబంధించిన మరో ప్రాంగణంలో పన్ను పరిధిలోకి రాని.. 50 కిలోల అదనపు స్టాక్‌ను గుర్తించినట్లు తెలిపింది. వాస్తవాలను దాచిపెట్టి పన్ను ఎగవేతకు పాల్పడినట్లు పేర్కొంది. ఫోరెన్సిక్ నిపుణులను రంగంలోకి దింపామని, లెక్కించని ఆదాయం తుది విలువను త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపింది.
ఇదీ చూడండి: ఐటీ సోదాల్లో రూ.1000 కోట్ల నల్లధనం పట్టివేత