జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ముష్కరులు హతం
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. సోపోర్ జిల్లాలోని హర్ద్శివ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రత దళాలకు మధ్య గురువారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులను హతమార్చాయి బలగాలు.
సోపోర్ జిల్లా హర్ద్శివ ప్రాంతంలో ముష్కరమూకలు నక్కి ఉన్నాయన్న పక్కా సమాచారంతో నిర్బంధ తనిఖీలు చేపట్టాయి బలగాలు. ఈ క్రమంలో జవాన్లపై కాల్పులకు పాల్పడ్డారు తీవ్రవాదులు. అది ఎన్కౌంటర్కు దారి తీసింది.
ఇంకా కొంతమంది ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు సమాచారం. ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
బుద్గాంలో ఉగ్రమూకల అరెస్ట్..
జమ్ముకశ్మీర్ బుద్గాం జిల్లాలోని నర్బల్ ప్రాంతంలో ఐదుగురు ఉగ్రవాద సానుభూతిపరులను అరెస్ట్ చేశారు పోలీసులు, ఆర్మీ అధికారులు. వారి వద్ద నుంచి 28 రౌండ్ల ఏకే 47, 1 మ్యాగజైన్, 20 లష్కరేతోయిబా పోస్టర్లు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన వారిని ఇమ్రాన్ రషీద్, ఇఫ్షాక్ అహ్మద్ గనీ, ఓవైసీ అహ్మద్, మొహ్సిన్ ఖాదిర్, అబిడ్ రాధర్లుగా గుర్తించారు. వీరంతా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించటం సహా అవసరమైన సామగ్రిని చేరవేస్తున్నారని తెలిపారు. యూఏపీఏ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.