నవ భారత నిర్మాణం దిశగా ఆయుష్మాన్ భారత్ పథకం అమలవుతుండటాన్ని విప్లవాత్మక చర్యగా పేర్కొన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా దిల్లీలో నిర్వహించిన.. ఆరోగ్య మంథన్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధాని. లబ్ధిదారులతో ముచ్చటించిన ఆయన పథకం అమలవుతున్న తీరుపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు.
ఆయుష్మాన్ భారత్ పథకంలో ఎలాంటి లోపాలు లేకుండా చేసి, పేదలకు మరింత చేరువయ్యేలా చూడాలని అధికారులను కోరారు మోదీ.
"దేశంలోని 50 కోట్ల మంది పేదలకు మేలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం తొలి వార్షికోత్సవంపై మాట్లాడటానికి ఇంతకంటే మంచి సమయం ఏముంటుంది? ఆయుష్మాన్ భారత్ తొలి ఏడాది సంకల్పం, అంకిత భావం, నేర్చుకోవటంతో ముడిపడి ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్యపరిరక్షణ పథకం విజయవంతంగా నిర్వహించడానికి భారతదేశ సంకల్ప శక్తి మాత్రమే కారణం. ఈ విజయం వెనుక అంకిత భావం, సద్భావన దాగి ఉంది. ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం చూపిన అంకిత భావన ఉంది. దేశంలోని వేలాది ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల కృషి ఉంది. ప్రతి ఉద్యోగి, వైద్యుడు, ఆయుష్మాన్ మిత్ర, ఆశావర్కర్లు సహా అందరి కృషి ఉంది."
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి