కరోనా సోకి మరణించిన వారి శరీరంలో వైరస్ 18 గంటల పాటు సజీవంగా ఉంటుందని వెల్లడించారు కర్ణాటక బెంగళూరులోని ఆక్స్ఫర్డ్ ఆస్పత్రి ఫోరెన్సిక్ నిపుణులు. కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఓ 62 ఏళ్ల వ్యక్తి శవపరీక్షలో ఈ విషయాన్ని గుర్తించినట్లు ఆక్స్ఫర్డ్ వైద్య కళాశాల ఫోరెన్సిక్ విభాగం ముఖ్య అధికారి డాక్టర్ దినేశ్ చెప్పారు.

కొద్ది రోజుల క్రితం కరోనా సోకి ఆస్పత్రిలో చేరిన వ్యక్తి చికిత్సకు స్పందించలేదని, ఆరోగ్యం విషమించి ముఖ్య అవయవాలు దెబ్బతిని చనిపోయాడని దినేశ్ తెలిపారు. ఆయన కుటుంబ సభ్యుల అనుమతితోనే క్లినికల్ శవపరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. దీనిలో పలు కీలక విషయాలు వెల్లడైనట్లు వివరించారు.
సాధారణంగా మానవులు ఊపిరితిత్తులు సున్నితమైన స్పాంజి బంతిలా ఉంటాయని, కానీ కరోనా సోకి మరణించిన వ్యక్తిలో అవి తోలులా మారాయని దినేశ్ వివరించారు. వాటి బరువు కూడా పెరిగిందన్నారు. అంతేకాకుండా రోగి మెదడులో రక్తం గడ్డకట్టిందని, గుండె, శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.
మరణించిన వ్యక్తి ఊపరితిత్తుల్లోనూ రక్తం గడ్డకట్టినట్లు గుర్తించామని చెప్పారు డాక్టర్ దినేశ్. ఇలాంటి క్లినికల్ శవపరీక్షలు నిర్వహించడం వల్ల ఏఏ అవయవాలను వైరస్ దెబ్బతీస్తుందనే విషయాలు తెలుస్తాయన్నారు. దానికి అనుగుణంగా చికిత్సా విధానాలను మార్చుకోవచ్చని తెలిపారు.