కొంత మంది కార్పొరేషన్ వర్కర్స్ ఓ కరోనా మృతదేహం పట్ల అత్యంత అమానవీయంగా ప్రవర్తించిన ఘటన పుదుచ్చేరిలో జరిగింది.
చెన్నై థౌజండ్ లైట్స్ ప్రాంతానికి చెందిన 44 ఏళ్ల వయస్సున్న ఓ వ్యక్తి జూన్ 4న పుదుచ్చేరిలోని అత్తారింటికి వచ్చాడు. అయితే అకస్మాత్తుగా గుండె పోటుకు గురై మరణించాడు. మృతదేహానికి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది.
పుదుచ్చేరి ప్రభుత్వం కరోనా మృతుడి ఖననానికి పద్ధతి ప్రకారం ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. అయితే నలుగురు కార్పొరేషన్ వర్కర్లు మృతుని పార్థివ దేహం పట్ల అత్యంత నిర్లక్ష్యంగా, అమానవీయంగా ప్రవర్తించారు. ఓ తెల్లని వస్త్రంలో మృతదేహాన్ని ఉంచి, అప్పటికే సిద్ధం చేసిన గోతిలోకి విసిరిపారేశారు.
ఈటీవీ భారత్ ఈ ఘోరాన్ని గురించి పుదుచ్చేరి ఆరోగ్యశాఖ అధికారులను ప్రశ్నించింది.
"మృతుని అత్యక్రియలకు కనీసం కుటుంబ సభ్యులు కూడా హాజరుకాలేదు. దీనితో ఎక్కడ తమకు కరోనా వైరస్ సోకుతుందోనని వర్కర్స్ భయపడి ఉంటారు."
- పుదుచ్చేరి ఆరోగ్యశాఖ అధికారి
కరోనా మృతులను పద్ధతి ప్రకారం ఎలా ఖననం చేయాలో మరోసారి తమ కార్మికులకు శిక్షణ ఇస్తామని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో నమోదైన మొదటి కరోనా మరణం ఇదే కావడం గమనార్హం. అయితే తాజా కరోనా మరణం తమిళనాడు (చెన్నై) ఖాతాలోకి వెళుతుందని అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కరోనా రికార్డ్: 24 గంటల్లో 9,971 కేసులు, 287 మరణాలు