బయటికొస్తే కరోనా మహమ్మారి ఎక్కడి నుంచి దాడి చేస్తుందో తెలీక జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే, లాక్డౌన్ కాలంలో ఎవరింట్లో వారు ప్రశాంతంగా గడిపేందుకు మధ్యప్రదేశ్‌లోని ఓ తల్లి తనవంతు కృషి చేస్తోంది. ఆరు నెలల బిడ్డను గుండెలపై మోస్తూ.. విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తోంది. ప్రతి ఇంటిలో వెలుగులు నింపుతోంది.
కోలార్‌లోని నయాపుర సబ్-స్టేషన్లో ఏడేళ్లుగా విధులు నిర్వహిస్తోంది ప్రగతి తాయిదా. కొద్ది నెలల క్రితం పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ప్రసూతి సెలవులు ముగిశాయి, తిరిగి విధుల్లోకి చేరింది. కరోనా భయం వెంటాడుతున్నా, ఉద్యోగాన్ని విస్మరించలేదు. అలా అని బిడ్డను ఇంట్లో వదిలి వచ్చే వీలు లేదు. భర్త, అత్తయ్య ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. అందుకే, ఆరు నెలల చిన్నారిని ఒడిలో పెట్టుకుని బాధ్యతగా సాగిపోతుంది.
"అవును ఇది కాస్త ప్రమాదకరమైన పనే. కానీ, ఈ విపత్తు పరిస్థితుల్లో నేను నా వృత్తి బాధ్యతలు నిర్వర్తించడం చాలా అవసరం. అలాగే నా కుమార్తెను చూసుకోవాలి. ఇంట్లో తనను చూసుకునేందుకు ఎవరూ లేరు. కరోనా కారణంగా ఇలా నాతోనే తీసుకురావాల్సి వస్తోంది. ఇలాంటి సమయాల్లో విద్యుత్ శాఖలో లైన్మెన్ దగ్గరి నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ విశేష సేవలందిస్తున్నారు. "
-ప్రగతి తాయిదా, విద్యుత్ శాఖ ఉద్యోగి
వైరస్ సోకకుండా ప్రగతి తగు జాగ్రత్తలు పాటిస్తోంది. ఎప్పటికప్పుడు చేతులు శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటూ, వ్యక్తిగత దూరాన్ని పాటిస్తూ తన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది.