వలస కూలీల కష్టాలు, కార్మిక చట్టాల సంస్కరణలకు సంబంధించి ఇతర విపక్షాలతో చర్చించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ మేరకు భావసారూప్య పార్టీలు కలిసి రావాలని కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
శుక్రవారం జరిగే ఈ సమావేశానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షత వహిస్తారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ భేటీలో 17 విపక్ష పార్టీల అధినేతలు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ భేటీకి హాజరవుతున్నారు. సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఇంకా ఎటువంటి సమాచారం లేదు.
దేశమంతా పాదయాత్రలు..
లాక్డౌన్ కారణంగా చాలామంది వలస కూలీలు ఉపాధి కోల్పోవటం వల్ల స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అనేకమంది పాదయాత్రల ద్వారా వందల కిలోమీటర్లు ప్రయాణించారు. ఈ ప్రక్రియలో కొంత మంది మృత్యువాత పడ్డారు. ఈ సంక్షోభ సమయంలో వలస కూలీల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ప్రతిపక్షాలు విమర్శించాయి.
కార్మిక చట్టాలపై..
ఇదే సమయంలో భాజపా పాలిత ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్లో కార్మిక చట్టాలను సవరించడాన్ని కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ తప్పుబట్టాయి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కార్మికుల ప్రాథమిక హక్కులను పణంగా పెడుతున్నారని కేంద్రంపై మండిపడ్డాయి.
ఈ సవరణల ప్రకారం..
కార్మికుల సంక్షేమ చట్టాల నుంచి పారిశ్రామిక కేంద్రాలకు మినహాయింపు ఉంటుంది. ఫలితంగా పనిగంటలు పెంచేందుకు యాజమాన్యాలకు అవకాశం లభిస్తుందని... దీన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కును కార్మికులు కోల్పోతారని విశ్లేషకులు అంటున్నారు.