ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ కంచుకోటల్లో ఛత్తీస్‌గఢ్ ఒకటి. 15 సంవత్సరాల అధికారం. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలోనున్న 11 ఎంపీ స్థానాల్లో 10 గెలుపు. ఇది భాజపా విజయ ప్రస్థానం.
2018 విధానసభ ఎన్నికల్లో పరిస్థితి మారిపోయింది. పార్టీ ఘోరపరాజయం చూసింది. ఆత్మపరిశీలనలో పడింది అధినాయకత్వం. ఈసారి కంచుకోటలో తిరిగి పాగా వేయాలనుకుంటోంది. అందుకే... సంచలన నిర్ణయం తీసుకుంది. సిట్టింగ్ ఎంపీలు అందరినీ ఈసారి పక్కనబెట్టి... కొత్తవారిని రంగంలోకి దించుతున్నట్లు ప్రకటించింది. ఇందుకు భాజపా చెప్పే కారణం... ప్రజావ్యతిరేకతను అధిగమించడం.
ఈ నిర్ణయం వల్ల ఆ పార్టీ నష్టపోతుందని కొందరు, వ్యూహాత్మక అడుగులు వేస్తోందని మరికొందరు విశ్లేషిస్తున్నారు.
ఇదీ చూడండి :భారత్ భేరి: "గౌరవం"పై రాజకీయ దుమారం
తిరుగుబాటు భయం లేదా?
భాజపా ఈ 'మార్పు' నిర్ణయానికే కట్టుబడి ఉంటే రాష్ట్రంలో భారీ నష్టాన్ని చూడాల్సి ఉంటుందన్నది నిపుణలు అంచనా. టికెట్ రాని సిట్టింగ్‌లంతా పార్టీకి పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉంది. రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగితే మొదటికే మోసం వస్తుంది. ఓట్ల చీలికతో పరాజయం మూటకట్టుకోవాల్సి ఉంటుంది.
అలా కాకుండా వీరంతా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా, ప్రచారంలో పాల్గొనకుండా ఉండే అవకాశం ఉంది. అలా జరిగినా పార్టీ వెనుకబడే ప్రమాదముంది.
సిట్టింగ్‌లకు టికెట్ నిరాకరణ అంశం ప్రత్యర్థులకు ఆయుధంగా మారనుంది. పదవీకాలంలో సమర్థంగా పనిచేయకపోవటం వల్లే అధినాయకత్వం టికెట్లు ఇవ్వలేదన్న విమర్శతో కాంగ్రెస్ లబ్ధిపొందుతుంది.
సిట్టింగ్‌ల మార్పుతో సామాజిక సమీకరణాల సమతుల్యం కష్టమవుతుందన్నది నిపుణుల అభిప్రాయం.
ఇదీ చూడండి :భారత్ భేరి: చిన్నోళ్లైనా చితక్కొడతారట
జాతీయ రాజకీయాల్లోకి రమణ్‌సింగ్...
భాజపా అగ్రనాయకత్వం మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ సేవలను జాతీయ స్థాయిలో ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రమణ్ కుమారుడు ప్రస్తుతం రాజ్‌నాంద్‌గావ్ ఎంపీ. అక్కడి నుంచే మాజీ ముఖ్యమంత్రిని బరిలోకి దించాలనుకుంటున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో అత్యధిక కాలం పార్లమెంటు సభ్యుడిగా ఉన్న నేత రమేష్ బోస్. ఈయన వరుసగా ఏడు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రతిసారి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈయన వాజ్‌పేయీ ప్రభుత్వంలో మంత్రి. గ్రామీణ ఓటర్లలో మంచి ఆదరణ ఉంది. బలమైన అభ్యర్థిగా ఉంటారని అందరూ భావిస్తున్నప్పటికీ... ఆయన్నూ పక్కనబెట్టాలని భాజపా నిర్ణయించడం చర్చనీయాంశమైంది.
ఇదీ చూడండి :ద్రవిడ సంగ్రామం 8సీట్లకే పరిమితం