దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న వేళ.. వలస కార్మికుల కదలికలను పర్యవేక్షించేందుకు కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కాంటాక్ట్ ట్రేసింగ్ను మరింత సులభతరం చేస్తూ ఆన్లైన్ డాష్‌బోర్డును ప్రారంభించింది. మొబైల్ నంబర్ సాయంతో ఈ కాంటాక్ట్ ట్రేసింగ్ సాధ్యమవుతుందని వెల్లడించింది హోంశాఖ. ప్రతి వలసదారుడికి ప్రత్యేక ఐడీ కేటాయించనున్నట్లు తెలిపింది.
వలస కార్మికులను బస్సులు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్ల ద్వారా తమ స్వస్థలాలకు తరలించేందుకు ఇప్పటికే కేంద్రం అనుమతించిందని.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తెలిపారు హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా.
కూలీలను కాంటాక్ట్ ట్రేసింగ్ చేసేందుకు జాతీయ వలసదారుల సమాచార వ్యవస్థ(ఎన్ఎంఐఎస్) పేరుతో.. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంఏ) ఈ ఆన్లైన్ డాష్‌బోర్డును అభివృద్ధి చేసినట్లు వివరించారు. క్షేత్రస్థాయి అధికారులకు ఒత్తిడి లేకుండా.. రాష్ట్రాల మధ్య త్వరితగతిన సమాచారాన్ని పంచుకునేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడనందని తెలిపారు.
లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి వలస కూలీలు తమ స్వస్థలాలకు చేరుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే మహారాష్ట్రలో 16 మంది రైలు ప్రమాదంలో మరణించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 25 మంది కార్మికులు మరణించారు.
అన్ని జిల్లాలకు శ్రామిక్ రైళ్లు...
దేశంలోని అన్ని జిల్లాల నుంచి శ్రామిక్ స్పెషల్ రైళ్లను నడిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రైల్వేశాఖ తెలిపింది. లాక్డౌన్ కారణంగా ఎక్కడికక్కడ చిక్కుకున్న పలస కార్మికుల జాబితాను సిద్ధం చేయాలని కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ జిల్లా కలెక్టర్లకు సూచించారు.