కరోనా నియంత్రణ, ఖరీఫ్ వేళ రైతు సంక్షేమం దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్ర మంత్రివర్గం. రైతులకు మేలు చేకూర్చే విధంగా ఆరున్నర దశాబ్దాల నాటి నిత్యావసర వస్తువుల చట్టానికి సవరణలు చేసేందుకు ఆమోదముద్ర వేసింది. ప్రతిపాదిత సవరణలు చట్టంగా మారితే ధాన్యం, తృణధాన్యాలు, ఉల్లిగడ్డ వంటి ఉత్పత్తులను సులభంగా రవాణా చేసేందుకు వీలు కలుగుతుందని.. దీనివల్ల రైతుల ఆదాయం పెరుగుతుందని వెల్లడించింది.
'ఉత్పత్తి తగ్గలేదు'
రబీకాలంలో కరోనా సంక్షోభం వచ్చినప్పటికీ వ్యవసాయ ఉత్పత్తి తగ్గలేదని కేంద్రం పేర్కొంది. రైతు ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించే దిశగా ఒకే దేశం-ఒకే మార్కెట్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. రైతు సాధికారత-రక్షణలు, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరపై ఆర్డినెన్స్‌కు ఆమోదముద్ర వేసింది.
హోమియో వైద్యానికి కమిషన్
భారతీయ వైద్యం, హోమియోపతి నియంత్రణ కోసం ఫార్మాకోపియాపై కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది కేంద్రం. ఈ విభాగం ఆయుష్ మంత్రిత్వ శాఖ కింద పనిచేయనున్నట్లు స్పష్టం చేసింది.
పెట్టుబడుల ఆకర్షణ దిశగా..
దేశం ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా పెట్టుబడుల ఆకర్షణ కోసం.. శాఖల కార్యదర్శులతో బృందం(ఈజీఓఎస్), ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సెల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపింది కేంద్రం.
ఇదీ చూడండి: సరిహద్దు రగడపై కీలక భేటీకి భారత్-చైనా రెడీ