లాక్‌డౌన్‌తో ఉపాధి పోయింది. పట్టణాల్లో బతుకు బరువైంది. ఆకలి దప్పులతో డొక్క కుంగిపోయింది. కన్న ఊరు యాదికొచ్చింది. మండుతున్న సూరీడు, సెగలు గక్కుతున్న తారు రోడ్డును లెక్క చేయక.. సొంతగూటికి చేరేందుకు పయనమైనవారిపై మృత్యువు కన్నెర్ర జేసింది. అలసి రైలు పట్టాలపై సేదదీరితే ఔరంగాబాద్‌లో 16 మందిపై మృత్యుపాశం విసిరింది. ఇప్పుడు మళ్లీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఔరయ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం రూపంలో 24 మంది వలస కూలీలను బలిగొంది.
రాజస్థాన్ నుంచి 50 మంది వలస కూలీలు తమ స్వస్థలాలకు ట్రక్కులో తిరిగి వెళ్తుండగా దిల్లీ నుంచి వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. తెల్లవారుజామున మూడున్నర గంటలకు జరిగిన ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. 36 మంది గాయపడ్డారు.
ఈ ఘటనలో మరో 14 మంది పరిస్థితి విషమించగా.. మెరుగైన చికిత్సకోసం సైఫైలోని ఆస్పత్రికి తరలించినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. మరో 22 మంది క్షతగాత్రులను ఔరయ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బాధితులంతా ఉత్తర్‌ప్రదేశ్, ఝార్ఖండ్, బంగాల్ రాష్ట్రాలకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు.
ప్రమాదంపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించి, ప్రమాద కారణాలపై నివేదిక సమర్పించాలని కాన్పుర్ ఐజీని.. యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలన్నారు.
ఇదీ చదవండి:'వలస కార్మికుల తరలింపులో చొరవ తీసుకోండి'