మే నెల మూడో తేదీ వరకు దేశవ్యాప్త లాక్‌డౌన్ పొడిగించిన కేంద్రం.. ఈ నెల 20 నుంచి కొన్ని రంగాలకు మినహాయింపులు ప్రకటించింది. పట్టణాల్లో నిర్మాణాల కొనసాగింపును, గ్రామాల్లో పారిశ్రామిక కార్యకలాపాలను, సెజ్‌లలో పూర్తిస్థాయి పనులను అనుమతిస్తామనడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐటీ పరిశ్రమ అధిక శాతం ఒకేచోట కేంద్రీకృతమైన తెలంగాణ వంటి రాష్ట్రాల్లో సగం మంది ఉద్యోగుల హాజరుకు పచ్చజెండా ఊపినా.. అక్కడ భారీ జనసమ్మర్దంతోపాటు వాహనాల రద్దీ పెరగడం తథ్యం. ఆ క్రమంలో నిర్మాణరంగం పనులూ మొదలైతే, కరోనా వ్యాప్తి నివారణకు అత్యంత ముఖ్యమైన 'సామాజిక దూరం' గల్లంతు కాక తప్పదు. అదే జరిగితే, ఇన్నినాళ్ల శ్రమ బూడిదలో పోసిన పన్నీరు చందమవుతుంది. విస్తృత మార్గదర్శకాల్లో భాగంగా అన్నిరకాల వ్యవసాయ, మార్కెటింగ్ కార్యకలాపాలకు మార్గం సుగమం చేశారు. రబీ పంటకాలానికి సంబంధించి నిర్ణాయక కోతల ఘట్టంలో వరస ప్రతికూలాంశాలు రైతాంగాన్ని ఇప్పటికే కుంగదీస్తున్నాయి. ఈ దశలో సేద్య రంగానికిచ్చిన మినహాయింపులు స్వాగతించాల్సిందే గాని, అక్కడా తగినన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ప్రస్తుతం గ్రామాల్లో ఉపాధి హామీ పనులు మళ్లీ ఆరంభమైతే కరోనా వైరస్ కోరలు చాచే ముప్పుందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
రూ. లక్షల కోట్ల త్యాగం.. వృధాగా పోరాదు..
నిర్బంధ మూసివేత కొనసాగినన్నాళ్లు దేశార్థికానికి రోజూ రూ.35 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లుతుందని అంచనా. మొత్తం నలభై రోజుల లాక్‌డౌన్ పద్దుకింద అలా లెక్కతేలే నష్టం రూ.14 లక్షల కోట్ల రూపాయలకు మించిపోనుంది. అంతటి సాహసోపేత నిర్ణయానికి సిద్ధపడ్డాక, ఒక్కో అంశాన్నీ నిశితంగా పరిశీలించాకనే ఆంక్షల్ని ఆచితూచి సడలించడం ఉత్తమం. ఏ రంగంలోనైనా ప్రాంతంలోనైనా ఒక్కసారి గేట్లు ఎత్తేసే పద్ధతి మరింత సంక్షోభాన్ని వాటిల్లజేయగల ప్రమాదముంది!
ఉల్లంఘనలతో సమాజం మొత్తానికి చేటు..
మహమ్మారి వైరస్‌ను ప్రభావశూన్యం చేసే లక్ష్యంతోనే ప్రధాని మోదీ లాక్‌డౌన్ వ్యూహానికి ఓటేశారు. దురదృష్టవశాత్తు, దేశంలో అది అమలులో ఉండగానే- ఎన్నోచోట్ల ఉల్లంఘనలు జోరెత్తుతున్నాయి. బ్యాంకులు, సూపర్ బజార్లు, కాలనీల్లో కిరాణా దుకాణాలు, తోపుడుబళ్ల వద్ద సామాజిక దూరం పాటించాలన్న స్పృహ.. జనసామాన్యంలో కొరవడుతోంది. పరిస్థితి మెరుగుపడిందన్న భావనతో జనసంచారంపై ఆంక్షలు సడలిస్తే, కేసులు ఉద్ధృతమైన పక్షంలో ఆ తాకిడిని తట్టుకోవడం ఎవరి తరం? అస్వస్థురాలై ప్రైవేటు ఆస్పత్రిని ఆశ్రయించిన భాగ్యనగర మహిళ నుంచి 19 మందికి వైరస్ సోకిన ఉదంతం- కరోనా విశృంఖలత్వాన్ని చాటుతుంది. దిల్లీలో పీజా సరఫరా చేసే యువకుడు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాక, అతగాడి సేవలందుకున్న 89 మందిని అధికారులు క్వారంటైన్ చేశారు. పలు రాష్ట్రాల్లో కేసుల ప్రజ్వలనానికి కారణమైన నిజాముద్దీన్ మర్కజ్ బాగోతం తెలిసిందే.
పకడ్బందీ ఏర్పాట్లతోనే..
సామాజిక దూరం నిబంధనను, కనీస జాగ్రత్తలను గాలికొదిలేయడం కరోనా వైరస్ అనే కొరివితో తల గోక్కోవడమేనని రుజువవుతున్నా పట్టించుకోని అలక్ష్యం- ఆత్మహత్యా సదృశం. ఒకసారంటూ కేసుల సంఖ్య అదుపుతప్పి పరిస్థితి చేజారిపోయాక చేయగలిగేదేమీ ఉండదని మహారాష్ట్ర దురవస్థ సోదాహరణంగా తెలియజెబుతోంది. 19 వందల ఐసొలేషన్, రెండు వందల ఐసీయూ పడకలు నిండిపోయి అత్యవసర కేసులు వస్తే ఎలా నిభాయించాలో తోచక ముంబై మహానగరం విలవిల్లాడుతోంది. మూడొంతుల మేర వైద్య సిబ్బంది పోగుపడిన నగరాలే అలాగైతే, వైరస్ దాడిని గ్రామీణ భారతం తట్టుకోగలదా? నవంబరులో మరోసారి కరోనా దాడి చేస్తుందన్న నిపుణుల హెచ్చరికల దృష్ట్యా, మహమ్మారికి ఏ మాత్రం సందివ్వకుండా జాతి యావత్తూ ఏకతాటిపై నిలవాలి. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేదాకా ప్రజాబాహుళ్యానికి, ముఖ్యంగా బడుగు జనావళికి నిత్యావసర వస్తువులు, కూరగాయలు, మందులు ఎవరిళ్లలో వారికి అందించే పకడ్బందీ ఏర్పాట్లతోనే- దేశం కుదుటపడగలిగేది!
ఇదీ చూడండి: అన్నమలై గుహలో ఆ చైనీయుడు ఏం చేస్తున్నాడు?