పరస్పర నిందారోపణలతో పొద్దుపుచ్చే మన రాజకీయ వర్గం నోళ్లకు కరోనా మహమ్మారి కొన్ని రోజులపాటు తాళం వేసి, ఐక్యతలాంటిది ఏదో తీసుకొచ్చింది. అయితే ఇది పైచూపులకు మాత్రమే. తెర వెనుక చాలామంది రాజకీయ నాయకులు ప్రత్యర్థులపై దుమ్మెత్తి పోస్తూనే ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం మాటల గారడీ తప్ప మరేమీ కాదని కాంగ్రెస్ నేతలు కొందరు ఈసడిస్తున్నారు. మరోవైపు కొందరు భాజపా నేతాగణం హిందూ రాజ్య స్వర్ణ యుగం గురించి గుసగుసలాడుతున్నారు. మన గణతంత్రం ఇంత అధ్వానంగా ఎన్నడూ లేదు. గత నెల ఈశాన్య దిల్లీలో 53 మందిని బలిగొన్న మారణహోమం కలచివేసింది. దేశంలోని రెండు ప్రధాన పార్టీలు పరస్పర హననానికి ప్రయత్నిస్తున్నాయి. ఎవరి లోకం వారిదే అన్నట్లు ప్రవర్తిస్తూ కళ్లెదుట జరుగుతున్న వాస్తవాలను చూసేందుకు నిరాకరిస్తున్నాయి. మరోవైపు కరోనా దెబ్బ నుంచి ఎప్పటికి తేరుకుంటామో తెలియక సామాన్యజనం నిస్సహాయంగా చూస్తున్నారు. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం మాని కోవిడ్ 19ను కలిసికట్టుగా అంతమొందించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
ప్రజాస్వామ్యం వ్యక్తుల ఇష్టాయిష్టాలను, భిన్నత్వాన్ని గౌరవిస్తుంది. విభేదాలను, నిరసనలను అనుమతిస్తుంది. అయితే అదంతా పరస్పర సహకార పరిధిలోనే జరగాలి. విజేతల అభీష్టంతోపాటు పరాజితుల సమ్మతి సైతం ప్రజాస్వామ్యానికి కావాలి. ఇటీవలి వరకు మన రాజకీయ నాయకులు జయాపజయాలు శాశ్వతమని భావించేవారు కారు. ఓడిపోయినా తదుపరి ఎన్నికల సమరానికి సన్నద్ధులయ్యేవారు. నేడు ప్రతి ఎన్నికల పోరు ప్రత్యర్థిని తుదముట్టించడానికే అన్నట్లు జరుగుతోంది. ఒకవైపు భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉండగా పార్టీలు పోట్లాటలకు దిగడం భారత గణతంత్ర సత్తువను తోడేస్తోంది.
బలోపేతం చేయడమెలా?
ఛిద్రమవుతున్న పౌర జీవితాన్ని తిరిగి బలోపేతం చేయడమెలా? ప్రధానమంత్రి మారితే దేశ సమస్యలన్నీ సమసిపోతాయని కొందరు భావిస్తున్నారు. సామాజిక మాధ్యమాలను నియంత్రిస్తే చాలు, ప్రజాహిత జీవనంలో వివేకం తిరిగివస్తుందని మరికొందరు పేర్కొంటున్నారు. ఇంతకన్నా అమాయకత్వం మరొకటి ఉండదు. భారతదేశంలో విభజన రేఖలు ఎన్నడూ లేనంతగా బలపడ్డాయి. దీనికి బయటినుంచి వచ్చిన కరోనా వైరస్‌దే పూర్తి బాధ్యత అనడం పొరపాటు. భారత్‌లోని 18 కోట్ల ముస్లింలను బయటివాళ్లుగా, పరాయివాళ్లుగా చూడటం ఏమాత్రం సమంజసం కాదు. ఇలాంటి పెడ ధోరణులను పక్కనపెట్టి ఉద్యోగ కల్పన, ఆర్థిక ప్రగతిపై దృష్టి కేంద్రీకరించాలి. మనమంతా ఒకే జాతి అనే భావనను చిన్ననాటి నుంచే బాలల్లో పాదుగొల్పాలి.
భార్యాభర్తల మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడితే అవి విడాకులకు దారితీస్తాయి. పరస్పర గౌరవం ఉంటే వాటిని సామరస్యంగా పరిష్కరించుకుని కాపురం నిలబెట్టవచ్ఛు అదేమాదిరి రాజకీయ ప్రత్యర్థుల మధ్య సైద్ధాంతిక విభేదాలు ఎన్ని ఉన్నా, ఒకరినొకరు గౌరవించుకుంటూనే ఉండాలి. తమ అజెండాలను ప్రజల ముందుంచి వారి తీర్పును ఉభయులూ శిరసావహించాలి. ఈసారి ఓడిపోయినా వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదేనన్న ఆత్మవిశ్వాసంతో ప్రజల్లోకి వెళ్లాలి. అంతేతప్ప ఎదుటివాళ్లు పనికిమాలినవాళ్లని ఏవగించుకుంటూ అదేపనిగా తక్కువ చేసి మాట్లాడటం, ఆరోపణలు రువ్వడం సరికాదు. ఈనాటి రాజకీయ పార్టీలు అలనాటి లఖ్‌నవూ నవాబుల సంస్కృతినుంచి పాఠాలు నేర్చుకోవలసి ఉంది. ఒకరినొకరు గౌరవించుకోవడంలో లఖ్‌నవూ నవాబులకు సాటివచ్చేవారు వేరెవరూ లేరు. ఇద్దరు నవాబుల పల్లకీలు ఎదురుబొదురైనప్పుడు ఎదుటివారికి దారి ఇచ్చి ‘మొదట మీరే వెళ్లండి’ అంటూ ఎనలేని మర్యాద, అభిమానం ప్రదర్శించడం ఆ నవాబుల నైజం. ‘క్షమించండి, మీరేదో అన్నట్లున్నారు’ అంటూ సంభాషణ కొనసాగించడం వారికి అలవాటు. ఆ తరహా గౌరవ ప్రపత్తులను నేటి రాజకీయ నాయకులు అలవరచుకోవాలి. విధాన సభ మెట్ల మీద ప్రతిపక్ష నాయకుడు తారసిల్లినప్పుడు ఆయనకు దారి ఇచ్చి ముందు మీరే వెళ్లండి అంటే పాలక పార్టీ వారి మర్యాద ఇనుమడిస్తుందే తప్ప తరగదు. ఇదంతా డాంబికమని అనిపించవచ్చు కానీ, అవసరమైనప్పుడు కృతజ్ఞతలు, క్షమాపణలు చెప్పడం నాగరిక లక్షణం. లఖ్‌నవూ శైలి, మర్యాదలు సమాజంలో, రాజకీయాల్లో హింసకు విరుగుడుగా పనిచేస్తాయి.
ఆంగ్లం తెలిసినవారికీ తెలియనివారికి మధ్య అంతరం
దేశంలో పేదలు, ధనికులు; అగ్ర వర్ణాలు, నిమ్న వర్ణాలు, హిందూ ముస్లిం అంటూ రకరకాల భేదాలున్నాయి. వీటికన్నా చిత్రమైన, తీవ్రమైన అంతరం ఆంగ్లం తెలిసినవారికి తెలియనివారికి మధ్య నెలకొని ఉంది. ఆంగ్లంపై పట్టున్న కొందరికి ఇతరులను చిన్నచూపు చూసే అలవాటుంది. ఇంగ్లిషు మాట్లాడగలిగినవారి భేషజాన్ని ఎదుర్కోవాలంటే ఇతరులూ గడగడా ఆంగ్లంలో సంభాషించాలి. అంతర్జాలంలో ఉచితంగా లభ్యమవుతున్న యాప్‌లు, పాఠాల సాయంతో కొన్ని నెలల్లోనే ఆంగ్లంలో మాట్లాడే సత్తా సంపాదించుకోవచ్ఛు ధారాళంగా ప్రసంగించలేకపోయినా కాస్త వేగంగానే మాట్లాడవచ్ఛు కరోనా వైరస్ మూలంగా ‘లాక్‌డౌన్’లో ఉన్నవారు అంతర్జాల యాప్‌ల సాయంతో తమ ఆంగ్లానికి పదునుపెట్టుకోవచ్ఛు కరోనా కలకలం సద్దుమణిగి దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ ఊర్ధ్వముఖ పయనం ప్రారంభించాక, దేశంలో మతపరమైన, రాజకీయపరమైన విభేదాలకు సాంత్వన లభిస్తుందని ఆశిద్దాం.
ఇదీ చూడండి : 'ఈ పరిస్థితుల్లో రాజ్యసభ ఎన్నికలు నిర్వహించలేము'