అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు.. ప్రముఖుల ప్రయాణ ఖర్చు కూడా భారంగా మారింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి ప్రముఖుల పర్యటనలకు ఎయిరిండియా వీవీఐపీ ఛార్టర్ విమానాలను ఏర్పాటు చేస్తోంది. వీటికి సంబంధించిన ఖర్చులను సంబంధిత మంత్రిత్వ శాఖలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ వాటిని సకాలంలో చెల్లించకపోవడం వల్ల సుమారు 822 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయని ఎయిరిండియా తెలిపింది.
వీవీఐపీ ప్రయాణాల ఖర్చు, బకాయిలు తెలపాల్సిందిగా లోకేష్ బాత్రా అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా ఎయిరిండియాను కోరారు. 2019 నవంబరు 30 వరకు ప్రభుత్వం.. ఎయిరిండియాకు రూ.822కోట్లు బకాయి పడ్డట్లు ఆ సంస్థ తెలిపింది. విదేశీ ప్రముఖులను తీసుకెళ్లినందుకు 12 కోట్ల 65 లక్షలు బకాయి ఉన్నట్లు పేర్కొంది. గత మూడేళ్లుగా ప్రభుత్వం చెల్లించాల్సిన 236 కోట్ల బకాయిలు పెండింగ్‌లోనే ఉన్నట్లు ఎయిరిండియా వెల్లడించింది.
ఇతర కారణాలు..
అధిక వడ్డీల భారం, ఇతర సంస్థలు తక్కువ ధరలకు ప్రయాణాలు అందించటం, రూపాయి విలువ పతనమవ్వటం, సంస్థ నిర్వహణ ఖర్చులు పెరిగిపోవటం వంటి ఇతర కారణాలూ.. ఎయిరిండియాను అప్పుల ఊబిలోకి నెట్టేశాయి.