'పౌరసత్వ చట్ట సవరణ'పై ఈశాన్యాన నిరసనలు చెలరేగుతూనే ఉన్నాయి. తాజాగా భాజపా మిత్రపక్షం అసోం గణ పరిషత్ (ఏజీపీ) పౌరసత్వ చట్ట సవరణను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది.
యూటర్న్..
పౌరసత్వ చట్ట సవరణకు ఏజీపీ మొదట మద్దతు తెలిపింది. అయితే ప్రజల నుంచి దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఫలితంగా చాలా మంది పార్టీ నేతలు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఏజీపీ యూటర్న్ తీసుకుంది. పౌరసత్వ చట్ట సవరణను ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో... ప్రధాని మోదీ, అమిత్‌షాలను కూడా కలవాలని నిర్ణయించింది. ప్రజల అభిమతమే తమ అభిమతమని.. ఈశాన్య రాష్ట్రాల గుర్తింపు, ఉనికిని కోల్పోవడానికి సిద్ధంగా లేమని ఏజీపీ తేల్చిచెబుతోంది.
స్వపక్షం నుంచే వ్యతిరేకత
పౌరసత్వ చట్టంపై అసోం భాజపా నేతల నుంచి కూడా వ్యతిరేకత వస్తోంది. అసోం భాజపా నేత జతిన్ బోరా.. సీఏఏకు వ్యతిరేకంగా తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం.
ఏఏఎస్‌యూ పార్టీ
పౌరసత్వ చట్ట సవరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్ (ఏఏఎస్‌యూ) త్వరలో రాజకీయ పార్టీని ప్రారంభిస్తామని సంకేతాలిచ్చింది. దీనికి అనుబంధంగా కళాకారుల ఫోరం 'శిల్పి సమాజ్' ఏర్పాటుచేస్తామని పేర్కొంది. అధికార భాజపా, ఏజీపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా పార్టీని ఏర్పాటుచేస్తున్నట్లు ఏఏఎస్‌యూ అధ్యక్షుడు దీపాంక్ నాథ్ పేర్కొన్నారు.
రగులుతోన్న ఈశాన్యం..
పార్లమెంటు ఉభయసభల్లో పౌరసత్వ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర నిరసనలు చెలరేగాయి. ప్రత్యేకంగా అసోంలో ఈ ఘర్షణల్లో ముగ్గురు మరణించడంతో అక్కడ కర్ఫ్యూ విధించారు.
ఇదీ చూడండి: 'పౌర'సెగ: బంగాల్లో ఆందోళనలు మరింత ఉద్ధృతం