కర్ణాటక శివమొగ్గలో దయనీయ ఘటన జరిగింది. క్యాన్సర్తో బాధపడుతూ మృతి చెందిన కన్నతల్లి శవంతో ఐదు రోజులు గడిపింది ఓ కూతురు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుందని గమనించిన పొరుగువారు తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించాక కుళ్లిన తల్లి శవం పక్కన కూతుర్ని చూసి షాక్కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
మృతి చెందిన మహిళ పేరు రాజేశ్వరి(64). విశ్రాంత ఉపాధ్యాయురాలు. కొద్ది సంవత్సరాలుగా ఆమె క్యాన్సర్తో బాధపడుతున్నారు. మే 13న మాత్రలను మోతాదుకు మించి తీసుకున్నారు. వెంటనే ప్రాణాలు కోల్పోయారు. కూతురు ఆమె పక్కనే అలా ఉండిపోయింది.
పోలీసులు కేసు నమోదు చేశారు. రాజేశ్వరి భౌతిక కాయాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఐదు రోజుల పాటు తల్లి శవంతోనే గడిపిన కూతురు మానసిక స్థితిపై అనుమానంతో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.