దేశంలోని వన్యప్రాణులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నాయి. కేరళ ఏనుగు మృతిని మరువక ముందే.. అసోంలో మరో ఘటన చోటుచేసుకుంది. కాఛార్ జిల్లాలోని ఓ రిజర్వాయర్లో దాదాపు 13 కోతుల మృతదేహాలు లభ్యమయ్యాయి. పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన కటిరైల్ నీటి సరఫరా రిజర్వాయర్లో ఈ మృతదేహాలు తేలుతూ కనిపించాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
"ఈ ఘటన స్థానికులను ఆందోళనకు గురి చేసింది. ప్లాంటులో నుంచి వారికి నీరు అందుతుంది. 350కుపైగా కుటుంబాలు నీటి అవసరాల కోసం ఈ ప్లాంటుపై ఆధారపడుతున్నారు. కోతుల మృతదేహాలను అటవీశాఖ అధికారులు శవపరీక్షకు పంపించారు."
--- కటిరైల్ నీటి సరఫరా ప్లాంటు అధికారి.
రిపోర్టులు అందిన తర్వాతే.. ఈ ఘటనకు గల కారణాలు స్పష్టమవుతాయని అధికారి వెల్లడించారు. అయితే ఎవరో దుండగులు జలాశయాన్ని విషపూరితం చేసి ఉండొచ్చని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.
గువాహటిలో ఓ చిరుతను అతి దారుణంగా చంపి.. దాని పళ్లు, గోర్లు తీసుకున్న ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే ఇలా కోతుల మృతదేహాలు లభించడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది.