Bank Robbery : పట్టపగలే రాజస్థాన్‌లో బ్యాంకు దోపిడీ జరిగింది. ముసుగు ధరించి బ్యాంకులోకి వచ్చిన ఓ ఆగంతుకుడు.. బాంబుతో సిబ్బందిని బెదిరించి రూ.24 లక్షలతో పరారయ్యాడు. సికర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అనంతరం దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..
ఫతేపుర్ షెఖావతి సబ్‌డివిజన్‌లోని హర్సావా గ్రామంలో ఈ చోరి జరిగింది. మాస్కు ధరించిన ఓ దుండగుడు.. గురువారం మధ్నాహ్నం 12 గంటల ప్రాంతంలో యెస్ బ్యాంకులోకి ప్రవేశించాడు. అనంతరం బ్యాంకులో ఉన్న సొమ్మంతా తనకు ముట్టజెప్పాలని సిబ్బందిని బెదిరించాడు. లేదంటే తన వద్ద ఉన్న బాంబును పేల్చేస్తానని హెచ్చరించాడు.
దీంతో భయపడ్డ బ్యాంక్ సిబ్బంది మొదట రూ.1.25 లక్షలు దుండగుడికి తీసిచ్చారు. వాటితో సంతృప్తి చెందని దొంగ.. మరింత డబ్బును డిమాండ్ చేశాడు. ఈ క్రమంలోనే క్యాషియర్ గదిలోకి ప్రవేశించిన దుండగుడు.. మొత్తం 24 లక్షల రూపాయల వరకు బ్యాగులో సర్దేశాడు. అనంతరం సిబ్బందిని లోపలే ఉంచి.. బ్యాంకు మెయిన్ గేటుకు తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యాడు. దోపిడి జరిగిన సమయంలో బ్యాంకు లోపల కస్టమర్లెవ్వరూ లేరని సిబ్బంది తెలిపారు.
"నీ పిల్లలను నువ్వు ప్రేమిస్తే బ్యాంక్‌లో ఉన్న సొమ్మంతా ఇవ్వాలని దొంగ నన్ను డిమాండ్ చేశాడు. దీంతో నేను అతనికి రూ. 1.5లక్షలు ఇచ్చాను. దానికి సంతృప్తి చెందని దొంగ బలవంతంగా నన్ను స్ట్రాంగ్ రూంలోకి తీసుకెళ్లి.. మొత్తం రూ.24 లక్షలు బ్యాగ్‌లో సర్దుకున్నాడు. అనంతరం నన్ను స్ట్రాంగ్ రూంలోనే ఉంచి తాళం వేసి వెళ్లాడు" అని బ్యాంక్ మేనేజర్ వివరించారు. ఘటన అనంతరం పోలీసులను ఆశ్రయించారు బ్యాంకు సిబ్బంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని పట్టుకునే పనిలో పడ్డారు. బ్యాంకుతోపాటు చుట్టుపక్క పరిసర ప్రాంతాల్లో అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
పట్టపగలే దోపిడీ.. బైక్‌లపై వెంబడించి, తుపాకులతో బెదిరించి..
Delhi Robbery : పది రోజుల క్రితం కూడా దిల్లీలోని ప్రగతి మైదాన్ టన్నెల్ వద్ద పట్టపగలే దోపిడీ జరిగింది. కారులో వెళ్తున్న బంగారు ఆభరణాల వ్యాపారి, అతడి సహచరుడిని ఆపిన దొంగలు.. వారి వద్ద నుంచి 2 లక్షల రూపాయలను నగదును దోచుకెళ్లారు. రెండు బైకులతో వెంబడించి.. రోడ్డుపై వెళ్తున్న కారును అడ్డగించి తుపాకులు చూపించి నగదు బ్యాగును ఎత్తుకెళ్లారు. ఈ నెల 24వ తేదీన జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.