తమ పొట్ట కొట్టిన వ్యక్తి... కొలువులు ఊడగొట్టిన వ్యక్తి... తమ సర్కారును వ్యతిరేకిస్తున్న వ్యక్తి... ఎదురుగా వస్తే ఏం చేస్తారు? కచ్చితంగా నిలదీస్తారు... వీలైతే తిరగబడతారు. గాంధీజీకి(gandhi in england) సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. కానీ ఆయన మాటల మహిమతో ఆవేశంతో వచ్చిన వారు కాస్తా అభిమానులుగా మారారు! నిలదీద్దామనుకున్నవారు.. చెయ్యెత్తి జైకొట్టారు!
1931... ఇంగ్లాండ్‌లో రెండో రౌండ్‌టేబుల్ సమావేశం!(second round table conference) భారత భవిష్యత్‌పై బ్రిటిష్ ప్రభుత్వంతో చర్చ ఈ సమావేశం ఎజెండా. జాతీయ కాంగ్రెస్ తరఫున ఏకైక ప్రతినిధిగా హాజరయ్యారు గాంధీజీ!(gandhi in england 1931) ఈ సమావేశం ద్వారా పెద్దగా ఒరిగేదేమీ ఉండదని తెలిసినా.. భారత ప్రజల ఆకాంక్షను, వారి ఇబ్బందులను ప్రపంచానికి, ముఖ్యంగా ఆంగ్లేయులకూ చాటడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని భావించారాయన! అందుకే సంస్థానాధీశుల్లా ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారీ విడిది బంగళాలో ఉండలేదు. తూర్పులండన్‌లో(gandhi in england) కార్మికులుండే ప్రాంతంలో ఓ మిత్రుడి ఇంట్లో బస చేశారు. స్థానికులతో, అంతర్జాతీయ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగానే గాంధీజీకి వచ్చిందో అరుదైన ఆహ్వానం.. లాంకషైర్ కార్మికుల నుంచి!(gandhi in lancashire) పారిశ్రామికీకరణ తర్వాత బ్రిటన్ వస్త్ర ఉత్పత్తి రాజధానిగా ఎదిగింది లాంకషైర్. ఇక్కడ తయారయ్యే కాటన్ ఉత్పత్తులు యావత్ ప్రపంచానికి సరఫరా అయ్యేవి. దాదాపు 60శాతం దాకా భారత్‌కే ఎగుమతి! తొలి ప్రపంచయుద్ధం తర్వాత ఎదురుదెబ్బలు మొదలయ్యాయి. 1929 ఆర్థికమాంద్యం నాటికి భారత్‌కు ఎగుమతులు తగ్గి కంపెనీలు నష్టాల బాట పట్టాయి. మిల్లుల ఆధునికీకరణ లేక నాణ్యత తగ్గటం కూడా మరో కారణం! ఇదే సమయంలో... 1929లో భారత్‌లో గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ విదేశీ వస్తువులను బహిష్కరించాలని పిలుపిచ్చింది. వీటన్నింటి ఫలితంగా... లాంకషైర్‌లో వందల సంఖ్యలో మిల్లులు మూతపడ్డాయి. వేలమంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. మిగిలిన కారణాలన్నింటినీ పక్కనబెట్టిన బ్రిటన్ ప్రభుత్వం భారత్‌లో బహిష్కరణే బూచిగా చూపి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అందుకే గాంధీకి తమ బాధలు స్వయంగా చూపించి, ఆయన మనసు మార్చాలని, విదేశీ వస్తు బహిష్కరణను ఎత్తించేయాలని... లాంకషైర్ కార్మికులు(Lancashire in Britain) ఆయనకు ఆహ్వానం పంపించారు. ఈ పరిస్థితుల్లో అక్కడికి వెళ్లటం సరికాదనే సూచనలు వచ్చినా గాంధీజీ వాటిని తోసిపుచ్చారు. లాంకషైర్‌కు వెళ్లటానికే మొగ్గు చూపారు.
కొలువులు కోల్పోయి ఆగ్రహంతో ఉన్న కార్మికుల మధ్యకు వెళుతున్న గాంధీజీకి ఏమౌతుందోననే ఆందోళన బ్రిటిష్ ప్రభుత్వంలోనూ లేకపోలేదు. భద్రత కల్పించినా.. గాంధీజీ అక్కడికి వెళ్లగానే వాటన్నింటినీ తోసిరాజంటూ అందరిలో కలసిపోయారు. కార్మికులు, మిల్లు యజమానులు తమ బాధలు వెళ్లగక్కారు. ఇద్దరు ముసలి నేతకార్మికులు ముందుకొచ్చి... తమ పేదరికం గురించి చెబుతుంటే... "పేదరికం ఎలా ఉంటుందో మీకు తెలియదు... చెబుతాను వినండి" అంటూ భారత్‌లో నేత కార్మికుల పరిస్థితిని కళ్లకు కట్టినట్లు వివరించారు. గాంధీజీ! కార్మికులు మొదలు మిల్లు యజమానుల దాకా గాంధీజీ చుట్టూ మూగి శ్రద్ధగా విన్నారు. భారత ప్రజల కష్టాలు.. బ్రిటిష్ ప్రభుత్వ చర్యలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితి.. చాలా అంశాలపై వారితో నిర్మొహమాటంగా మాట్లాడారు గాంధీజీ! "కార్మికులు ప్రశ్నించారు... ఆవేశంగా వాదించారు... చివరకు సమాధానపడ్డారు" అని లేబర్ పార్టీ చరిత్రకారుడు సిమోన్ ఆనాటి సంఘటనను వర్ణించారు. "లక్షల మందిని సమాధుల్లోకి నెట్టి... వాటిపై ఇంగ్లాండ్ తన ఆనంద సౌధాన్ని నిర్మించటం సరికాదు" అనగానే... ఆయన మనసు మార్చాలని వచ్చిన కార్మికులు, మిల్లు యజమానులు చలించిపోయారు. అంతకుముందు మా కష్టాలు చూడండంటూ నిలదీసిన కార్మికులే... రెండువైపులా ఆయన చేతులు పట్టుకొని పైకి లేపి... ఆంగ్లేయుల పద్ధతిలో... "త్రీఛీర్స్ టు మిస్టర్ గాంధీ! హిప్ హిప్ హురే... హిప్ హిప్ హురే" అంటూ మూడుసార్లు ఆనందంతో నినదించారు. ఆయన్ను అభినందించారు. అలా పరోక్షంగా భారత జాతీయోద్యమానికి లండన్‌లో తెల్లవారితో జైకొట్టించారు గాంధీజీ!
ఇదీ చూడండి: Azadi ka Amrut Mahotsav: గాంధీ.. బ్రిటిష్ సైనికుడైన వేళ!