Ayodhya Ram Statue Weight : అయోధ్య రాముడి విగ్రహాన్ని నల్లటి ఏకశిలతో రూపొందించినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. విగ్రహం బరువు సుమారు ఒకటిన్నర టన్నులు ఉంటుందని వెల్లడించారు. నల్లరాతితో 51 అంగుళాల పొడవైన విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించనున్నట్లు చెప్పారు. కర్ణాటక, రాజస్థాన్‌కు చెందిన కళాకారులు చెక్కిన మూడు విగ్రహాల్లో ఒకదానిని ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. చంపత్ రాయ్ వ్యాఖ్యలతో కర్ణాటక మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన విగ్రహాన్ని ఎంపిక చేసినట్లు భావిస్తున్నారు. అయితే, మిగిలిన రెండు విగ్రహాలను ఆలయ ప్రాంగణంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిష్ఠించనున్నట్లు చంపత్‌రాయ్ చెప్పారు.
"రాముడి విగ్రహం నల్లరాతితో ఐదేళ్ల బాలుడి రూపంలో ఉండనుంది. ఆయన కళ్లు, నవ్వు, శరీరాకృతి, ముఖం ఇలా ప్రతి అంశంలోనే దైవత్వం ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకున్నాం. విష్ణు అవతారంగా, ఓ రాజు కుమారుడిగా, బాలుడిగా, ఓ దేవుడిగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాం. విగ్రహ బరువు సుమారు ఒకటిన్నర టన్నులు ఉంటుంది. నుదురు నుంచి కాలి వేళ్ల వరకు కలిపి విగ్రహ ఎత్తు 51 అంగుళాలు ఉంటుంది. ముగ్గురు శిల్పులు ఎంతో కష్టపడి పని చేశారు. వీటిలో ఒక విగ్రహాన్ని ఎంపిక చేసి, మిగిలిన రెండింటిని ఆలయంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిష్ఠిస్తాం."
--చంపత్ రాయ్, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి
అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగే రోజు తనకు స్వాతంత్ర్య దినోత్సవం లాంటిదని చంపత్ రాయ్ తెలిపారు. ప్రధాన ఆలయం బయట, ప్రహారికి లోపల ఏడు మందిరాలను నిర్మిస్తున్నామని వెల్లడించారు. మహర్షి వాల్మీకి, మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగస్త్య, నిశద్ రాజ్, మాతా శబరి, అహిల్య ఆలయాలను ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తామని వివరించారు. ఆలయ ప్రహారి బయట మరో ఏడు గుడులను కడుతామని చెప్పారు.
అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ పూజలు జనవరి 16నే ప్రారంభం కానున్నాయి. జనవరి 18న మధ్యాహ్నం గర్భగుడిలో విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఆ తర్వాత పవిత్ర జలాలు లేదా పాలతో విగ్రహాన్ని సంప్రోక్షణ చేయనున్నారు. విగ్రహాన్ని కడిగిన జలాలను సేవించినా శరీరంపై ఎలాంటి దుష్ప్రభావం ఉండదని చెప్పారు చంపత్ రాయ్. ప్రతి ఏడాది రామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు రాముడిపై సూర్య కిరణాలు పడేలా ఏర్పాట్లు చేసినట్లు రాయ్ చెప్పారు. ఇందుకోసం భారత అంతరిక్ష శాస్త్రవేత్తలు పరిశోధించి ఈ ఎత్తును నిర్ణయించారని తెలిపారు.
రామమందిర నిర్మాణం గురించి 33ఏళ్ల కిందటే చెప్పిన బాబా! మాజీ ప్రధానులూ ఆయన భక్తులే!!
భారీ భూకంపాలను తట్టుకునేలా అయోధ్య రామాలయ నిర్మాణం - డిజైన్లలో హైదరాబాదీ ప్రొఫెసర్ కీ రోల్