రాజకీయ నేతగా మారిన ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ మాజీ ఎంపీ అతీక్ అహ్మద్.. అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్‌ను దుండగులు శనివారం రాత్రి 10 గంటల సమయంలో కాల్చి చంపారు. ప్రయాగ్‌రాజ్‌లోని వైద్య కళాశాలకు పరీక్షల కోసం తరలిస్తుండగా.. వారిని మీడియా ప్రతినిధులు అనుసరిస్తూ ప్రశ్నలు వేస్తున్నారు. ఈ సమయంలోనే జర్నలిస్టుల్లా వచ్చిన ముగ్గురు వ్యక్తులు అతీఖ్ ఆహ్మద్, అష్రఫ్ అహ్మద్‌పై అతి దగ్గర నుంచి కాల్పులు జరిపారు. మొదట అతీఖ్ అహ్మద్ కణితిపై గురిపెట్టి కాల్చిన నిందితులు.. వారిద్దరూ కింద పడిపోగానే విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అతీఖ్ అహ్మద్ తలపై ఒక వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపగా ఆయన వెంటనే కిందపడిపోయారు. ఈ కాల్పులు జరుపుతున్న సమయంలో అతిఖ్ అహ్మద్.. అష్రఫ్ అహ్మద్ చేతులకు సంకెళ్లు వేసి ఉన్నాయి. ఈ కాల్పుల దృశ్యాలు జర్నలిస్టుల మీడియా కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఈ హఠాత్పరిణామంతో జర్నలిస్టులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ మాన్ సింగ్ చేతికి బుల్లెట్ గాయమైందని.. కాల్పుల అనంతరం జరిగిన గందరగోళంలో కిందపడిపోయిన జర్నలిస్టు కూడా గాయపడ్డారని ప్రయాగ్‌రాజ్ పోలీసు కమిషనర్ రమిత్ శర్మ తెలిపారు. కాల్పుల ఘటనకు కారణమైన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు.
తప్పనిసరి చట్టపరమైన విచారణలో భాగంగా అతిఖ్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్‌లను వైద్య పరీక్షల కోసం తీసుకొచ్చాం. పాత్రికేయులు వారిద్దరి బైట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు జర్నలిస్టులుగా వీరిద్దరి దగ్గరికి వచ్చి.. కాల్పులు జరిపారు. కాల్పులకు పాల్పడిన ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. ఈ కాల్పుల్లో అతీఖ్, అహ్మద్ మరణించారు. గాయపడ్డవారిలో ఒక పాత్రికేయుడు కూడా ఉన్నాడు. మాన్‌సింగ్ అనే కానిస్టేబుల్‌కు బుల్లెట్ గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. ఈ సమయంలో ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేం. సమగ్ర దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలు చెప్తాం.
-రమిత్ శర్మ, ప్రయాగ్‌రాజ్ పోలీసు కమిషనర్
గతంలో జరిగిన ఉమేశ్‌పాల్ కిడ్నాప్ కేసు విచారణలో భాగంగా నిందితులు ఇద్దరిని పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి వైద్య పరీక్షల కోసం తరలిస్తుండగా.. ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. గుంపులోంచి అతి సమీపం నుంచి అతీఖ్, అతడి సోదరుడిపై కాల్పులు జరిపారని ఆ సమయంలో తాను వారి పక్కనే ఉన్నానని.. అతీఖ్ తరపు న్యాయవాది విజయ్ మిశ్ర తెలిపారు.
అలహాబాద్ వెస్ట్ నుంచి అయిదుసార్లు ఎమ్మెల్యే.. ఎంపీగా గెలిచిన అతీఖ్ అహ్మద్‌పై దాదాపు వందకుపైగా క్రిమినల్ కేసులున్నాయి. 2005లో BSP-MLA రాజు పాల్ హత్య కేసులో అతీక్ అహ్మద్ ప్రధాన నిందితుడు. 2019 నుంచి సబర్మతి జైల్లో ఉన్నాడు. రాజు పాల్ హత్యకేసులో ముఖ్యసాక్షిగా ఉన్న ఉమేశ్ పాల్ 2006లో అపహరణకు గురై విడుదల కాగా.. 2007లో అతడు అతీక్, అష్రఫ్‌తోపాటు పలువురిపై కిడ్నాప్ కేసు నమోదు చేశాడు. ఈ కేసు విచారణ చివరి రోజైన ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉమేశ్‌పాల్ హత్యకు గురయ్యాడు. అతీక్, అతని అనుచరుల అక్రమాస్తుల్లో ఇప్పటివరకు 1400 కోట్ల ఆస్తులను యూపీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరో 108 కోట్ల నల్లధనాన్ని.. ED అధికారులు గుర్తించారు.
హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు అసద్.. ఈ నెల 13న పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోగా, కుమారుడి అంత్యక్రియల్లో కూడా అతీఖ్ పాల్గొనలేకపోయాడు. సకాలంలో కోర్టు అనుమతి లభించని కారణంగా కుమారుడి అంత్యకియలకు అతీఖ్ అహ్మద్ హాజరుకాలేదు. శనివారం ఓ వైపు అసద్ అంత్యక్రియలు జరుగుతుండగా.. మరోవైపు అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో అతీఖ్ అహ్మద్‌ను పోలీసులు విచారించారు. ఆ తర్వాత వారిద్దరిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. కాల్చి చంపారు. అతీక్ అహ్మద్ అయిదుగురు కుమారుల్లో అసద్ మృతి చెందగా.. మిగితా నలుగురిలో ఇద్దరు కుమారులు జైల్లో.. మైనర్లయిన ఇద్దరు కుమారులు గృహ నిర్భంధంలో ఉన్నారు. అతిక్, అష్రఫ్ భార్యలు పరారీలో ఉన్నారు.