Delhi Liquor Scam Case Updates: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇక ఈ కేసులో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో కీలక వ్యక్తి అరుణ్ పిళ్లై ఇప్పటికే అరెస్టు అయిన విషయం తెలిసిందే. పలు మార్లు ఆయన ఈడీ కస్టడీని పొడిగిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా దిల్లీ మద్యం కేసులో అరుణ్ పిళ్లైకి జ్యుడీషియల్ కస్టడీని కోర్టు విధించింది. అరుణ్ పిళ్లైకి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు వెల్లడించింది. అనంతరం అరుణ్ పిళ్లైని తీహాడ్ జైలుకు తరలించారు.
ఇదే కేసులో ఇప్పటికే దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఆయన కస్టడీ కూడా పలు మార్లు పొడిగిస్తూ వచ్చింది కోర్టు. తాజాగా ఆయనకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ.. దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. మనీశ్ సిసోదియాకు ఏప్రిల్ 3 వరకు జ్యూడిషియల్ కస్టడీని పొడిగించింది. ఇక సిసోదియా బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో రేపు విచారణ చేపట్టనుంది. దిల్లీ మద్యం కుంభకోణంలో సిసోదియా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం సంగతి తెలిసిందే.
మరోవైపు ఎమ్మెల్సీ కవితను కూడా ఈడీ అధికారులు విచారిస్తున్నారు. దిల్లీ మద్యం కేసులో రెండోసారి ఎమ్మెల్సీ కవిత విచారణకు ఈ ఉదయం హాజరయ్యారు. ఉదయం 11గంటల నుంచి జరగాల్సిన విచారణకు కవిత... 35నిమిషాల ముందే హాజరయ్యారు. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మనీలాండరింగ్ కేసులో అనుమానితురాలిగా కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
సౌత్ గ్రూప్ నుంచి కవిత కీలక వ్యక్తిగా పేర్కొన్న ఈడీ.. దిల్లీ, హైదరాబాద్ సమావేశాల్లో చర్చించిన అంశాలను ప్రశ్నిస్తున్నారు. బ్యాంక్ స్టేట్ మెంట్ సహా మిగిలిన డాక్యుమెంట్లను కవిత అందించింది. కస్డడీలో ఉన్న మనీష్ సిసోదియా, అరుణ్ రామచంద్రపిళ్లైతో కలిసి విచారిస్తున్నారా? లేదా అనే అంశంపై స్పష్టత రానుంది. దిల్లీ మద్యం కేసులో ఇవాళ విచారణకు రావాలని... కవితకు ఇప్పటికే ఈడీ నోటీసులు జారీచేసింది.మహిళలను ఈడీ విచారించడంపై కవిత దాఖలు చేసిన పిటిషన్ .. ఈ నెల 24న సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈలోపే కవిత ఈడీ విచారణ జరుగుతోంది.
ఇవీ చదవండి: