పాడుబడిన ఇంటిని తిరిగి నిర్మిస్తుండగా.. పురాతన బంగారు నాణేలు, అరుదైన ఆభరణాలు బయటపడ్డాయి. అయితే యజమానికి తెలియకుండా కూలీలు ఆ బంగారాన్ని గుట్టుగా పంచుకున్నారు. కానీ తాగిన మైకంలో ఓ వ్యక్తి నోరుజారడంతో ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. పోలీసులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో జరిగింది. అదనపు ఎస్పీ దేవేంద్ర పటిదార్ వివరాల ప్రకారం..
ధార్‌లోని ఓ పురాతన ఇంటిని కూల్చి అక్కడ కొత్త ఇంటిని నిర్మించేందుకు యజమాని కొందరు కూలీలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇంటిలోని కొంతభాగాన్ని కూల్చి శిథిలాలను తరలిస్తుండగా.. ఆ కూలీలకు బంగారంతో కూడిన లోహపు పాత్ర లభించింది. అందులో పురాతన బంగారు నాణేలు, అరుదైన ఆభరణాలు ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని వారు బయటకు పొక్కనీయలేదు. యజమానికి తెలియకుండా ఆ ఎనిమిది మంది పంచుకున్నారు.
ఇలా బయటపడింది..
కాగా వారిలో ఓ కూలీ తాజాగా నాణేన్ని అమ్మేశాడు. వచ్చిన రూ.56వేలతో కొన్ని సరకులు, ఓ ఫోన్ కొనుక్కున్నాడు. ఆపై ఫూటుగా తాగి, ఆ మైకంలో తమకు దొరికిన బంగారు నిధి గురించి మిత్రులకు చెప్పాడు. ఈ విషయం కాస్తా పోలీసుల దృష్టికి చేరింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ కూలీలందరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి బంగారు నాణేలు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.60 లక్షలు ఉంటుందని పోలీసులు పేర్కొంటుండగా.. పురావస్తు శాఖకు చెందిన అధికారులు మాత్రం రూ.1.25కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇవీ చదవండి: వారసులకు పెద్దపీట, ఈశాకు రిలయన్స్ రిటైల్, అనంత్‌కు న్యూ ఎనర్జీ