Graduate MLC results: ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ మాటకొస్తే రెండు తెలుగురాష్ట్రాల వాసులే కాదు...ఎక్కడెక్కడో ఉన్న తెలుగువారంతా ఇప్పుడు ఒకటే చర్చించుకుంటున్నారు. వివిధ పార్టీ నేతలు, కార్యకర్తలే కాదు రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని ఏ ఇద్దరూ ఒకచోట కలిసినా మొదటగా వారి మధ్య వచ్చే చర్చనీయాంశం మాత్రం ఒక్కటే. అదే.. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు. ఇలా ఎలా జరిగింది..? పట్టభద్రులంతా ఎందుకిలా ఓట్లు వేశారు....? తెలుగుదేశం పార్టీ ఎలా గెలిచింది...? జగన్ నమ్ముకున్న వాలంటీర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర అధికార యంత్రాంగం ఏం చేసింది..? వీరందర్నీ తోసిరాజని ఓటర్లు సైకిల్ వైపు మొగ్గటానికి కారణం ఏంటన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఉత్ఫన్నం అవుతోంది. 9 ఉమ్మడి జిల్లాల 108అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 8.50 లక్షల మంది ఓటర్ల మనోగతం ఇలా ఉందంటే… 2024ఎన్నికలు చిత్రం కళ్ల ముందు కనపడతున్నట్టేనా?
ప్రజానాడి ఇదేనా..?: ఆంధ్రప్రదేశ్ శానన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల, స్థానిక సంస్థల కేటగిరిల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు అందరి అంచనాలను తలకిందులు చేశాయి. చదవు చెప్పే పంతుళ్లు అధికార పార్టీని ఆదరిస్తే... చదువుకున్న పట్టభద్రులు అధికార పార్టీకి కర్రుకాల్చి వాతపెట్టినట్లు ప్రతిపక్షాన్ని బలపరిచారు. 9ఉమ్మడిజిల్లాల పరిధిలోని 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించిన ఉన్న మూడు పట్టభద్రుల స్థానాల్లో ప్రతిపక్ష తెలుగుదేశం అభ్యర్ధులు గెలవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఇలా వ్యక్తమైందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. పాలనా రాజధాని అని చెప్పిన విశాఖ, న్యాయ రాజధాని అని చెప్పిన కర్నూలు రెండు చోట్ల జనం ఆపార్టీ అభ్యర్ధులను ఆదరించలేదు. విశాఖ రాజధాని పేరుతో ఉత్తరాంధ్ర వాళ్లను వలసలు పేరు చెప్పి మంత్రి ధర్మాన రెచ్చగొట్టినా తీర్పు ఇలా రావడం YSRCP నేతలను, శ్రేణులను ఆలోచనలో పడేసింది. YSRCPకి కంచుకోటగా చెప్పుకునే పశ్చిమ, తూర్పు రాయలసీమ పట్టభద్రులూ ఫ్యాన్‌ను కాదని సైకిల్ వెంట వెళ్లడం ప్రజాభిప్రాయానికి కొలమనంగా చెబుతున్నారు. సాధారణంగా సర్వే సంస్థలు చేసే శాంపిళ్లు చాలా స్వల్పంగా ఉంటాయి. ఏ సర్వే సంస్థ అయినా అసెంబ్లీ నియోజకవర్గానికి 1000 శాంపిళ్లు తీసి ఇదే ప్రజా తీర్పు అని ప్రకటిస్తాయి. కానీ 108అసెంబ్లీ నియోజకవర్గాల్లోని దాదాపు ఓట్లేసిన 9లక్షల ఓటర్ల అభిప్రాయం ఇలా వ్యక్తమైంది.
మిగతా వాటితో పోల్చితే... పట్టభద్రుల ఓటు ఎందుకు కీలకమంటే..
1.గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ: డిగ్రీ పూర్తై ఓటు హక్కు నమోదు చేసుకున్న ప్రతి వారు ఇందులో ఓటరే. అందులో ఉద్యోగులు, ప్రైవేటు ఎంప్లాయిస్, వ్యాపారులు, చిన్న వ్యాపారులు, పీజీ విద్యార్థులు, నిరుద్యోగులు, మధ్యతరగతి, ఇలా అన్ని కులాలు, అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. సగటున ఒక్కో గ్రాడ్యుయేట్ స్థానంలో 2.90 లక్షల ఓట్లు ఉన్నాయి. అదే మిగతా స్థానిక సంస్థలు, టీచర్లవి వేలల్లోనే. ఇవి లక్షల్లో ఉన్నాయి. ప్రజాభిప్రాయం వ్యక్తం అయ్యేది గ్రాడ్యుయేట్ ఎన్నికల్లోనే. ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసుకునే అవకాశం ఇది. పట్టభద్రుల ఎన్నికల్లో ఎప్పుడూ తెలుగుదేశం, YSRCP తమ అభ్యర్ధులను ప్రకటించినా పెద్దగా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోలేదు. కానీ ఈసారి అధికార పార్టీ పట్టభద్రుల ఎన్నికను చాలా సీరియస్‌గా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలన్న పట్టుదలతో ఓట్లు చేర్చడం దగ్గరన్నుంచి ఓటింగ్ వరకు పటిష్ఠ వ్యూహాన్ని పన్నింది. జగన్ నమ్ముకున్న వాలంటీర్ల సాయంతో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇంఛార్జులు పట్టభద్రుల ఓటర్లను ఆకర్షించేందుకు చేయని ప్రయత్నం లేదు. పైగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల ప్రచారంలో YSRCP అభ్యర్ధి గెలిస్తేనే విశాక రాజధాని అన్న వాదన, సవాల్ సైతం చేశారు. పశ్చిమ రాయలసీమలో కర్నూలు న్యాయరాజధాని కావాలంటే YSRCP ఎమ్మెల్సీ అభ్యర్ధికి ఓటు వేయాలని అభ్యర్ధించారు. పైగా పశ్చిమ రాయలసీమలో జగన్ సొంత జిల్లా కడప, కర్నూలు, అనంతరం (ఉమ్మడి)లో ఆపార్టీ ఇప్పటికీ బలంగా ఉందన్న వాదన ఉంది. తూర్పు రాయలసీమకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేనని శ్రీనివాసరెడ్డి వంటి వారు బాధ్యత తీసుకుని YSRCP అభ్యర్ధి కోసం సర్వశక్తులూ ఒడ్డారు. పట్టభద్రుల స్థానాల్లో విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డి పోరడిన ఓటర్లు మాత్రం YSRCPని ఆదరించలేదు.
2.ఉపాధ్యాయ ఎమ్మెల్సీ : వాస్తవానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు సంబంధించి ఉపాధ్యాయ సంగాల్లో అధికార YSRCP సంఘానికి ఏమాత్రం బలం లేదు. కానీ గెలుపు మాత్రం ఆశ్చర్య మే. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా ఎప్పుడూ వామపక్ష సంఘాలు బలపరిచిన వారే నెగ్గుతూ ఉంటారు కానీ ఈ సారి వారిలో వారు చీలిపోయారు. ఈ చీలకను YSRCP బలపరిచిన ఇద్దరు అభ్యర్ధులు చక్కగా వినియోగించుకున్నారు.చీలిపోయిన వర్గాలను ఆదరించి సామదానభేద దండోపాయాలు ప్రయోగించి YSRCP బలపరిచిన ఇద్దరూ అభ్యర్థులు గెలుపుబావుటా ఎగురవేశారు. ఇది ఒక రకంగా వామపక్ష ఉపాధ్యాయ సంఘాలకు చెప్పపెట్టు.
3.స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు: సాధారణంగా స్థానిక సంస్థల్లో 90శాతం పదవుల్లో ఉన్న YSRCPవారే ఇందులో ఓటర్లు. పైగా వీళ్లంతా నిత్యం ఎమ్మెల్యేలు, మంత్రుల కనుసన్నల్లో ఉంటారు. వారు చెప్పిన వారికే ఈ స్థానిక సంస్థల ఓటర్లు ఓట్లు వేస్తారు. పైగా వీరంతా ఒక పార్టీకి చెందినవారే . అందుకే ఈ ఫలితాన్ని పెద్దగా ఎవరూ లెక్కించరు. సహజంగా ఎవరు అధికారంలో ఉంటే వారి అభ్యర్ధులే గెలుస్తూ ఉంటారు.
ఇవీ చదవండి: