అవయవాలన్నీ సరిగా ఉన్నా కూడా కొంతమంది పని చేసేందుకు ఇష్టపడరు. అయితే కర్ణాటకలోని మంగళూరుకు చెందిన పరశురాం అనే దివ్యాంగుడు తన వైకల్యాన్ని అధిగమించి కష్టపడి పనిచేస్తూ.. కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతరుల కష్టంపై ఆధారపడకుండా డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ ఆత్మగౌరవంతో బతుకుతున్నాడు. యాచించటం మానేసి కష్టపడి పనిచేసుకుంటున్న అతడు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
పరశురాం తల్లిదండ్రులు విజయపుర నగరానికి చెందినవారు. కుటుంబమంతా 30 ఏళ్ల క్రితం మంగళూరుకు వలస వచ్చింది. ఏడుగురు సంతానంలో పరశురాం పెద్దవాడు. పుట్టుకతోనే తన రెండు కాళ్లను పోగొట్టుకున్న పరశురాం.. చేతులతోనే అన్ని పనులు చురుకుగా చేసుకునేవాడు. అంగవైకల్యం ఉన్నా అతడు 9వ తరగతి వరకు చదువుకున్నాడు. ఇంట్లో ఆర్థిక సమస్యల కారణంగా పరశురాం.. గతంలో భిక్షాటన చేసేవాడు. వచ్చిన డబ్బులను ఇంటి ఖర్చుల కోసం ఇచ్చేవాడు.
![Karnataka handicapped man](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17733165_qq.jpg)
భిక్షాటన చేసే పరశురాం.. పనిచేసుకుని బతికేందుకు నిరంతరం ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాడు. ఈ క్రమంలో అతడు భిక్షాటన మానేసి సెక్యూరిటీ గార్డుగా పనిచేయటం మొదలు పెట్టాడు. ఆ తర్వాత స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా చేరాడు. ఉదయం సెక్యూరిటీ గార్డుగా... సాయంత్రం 6 నుంచి 12 గంటల వరకు డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు.
![Karnataka handicapped man](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17733165_pp.jpg)
స్విగ్గీ ఆర్డర్ తీసుకున్న తర్వాత పరశురాం మూడు చక్రాల బైక్‌పై డెలివరీ చేయాల్సిన ప్రదేశానికి వెళ్తాడు. ఒకవేళ అపార్ట్‌మెంట్‌పైకి ఎక్కాల్సి వస్తే లిఫ్ట్‌లో వెళ్తాడు. లేదంటే కస్టమర్‌కి ఫోన్ చేసి దివ్యాంగుడినని చెప్పి.. దిగి వచ్చి పార్సిల్ తీసుకోమని అభ్యర్థిస్తాడు. ఈ ఉద్యోగం కోసం పరశురాం సెకండ్ హ్యాండ్ బైక్‌ను కొన్నాడు. కానీ అది కొన్ని రోజులకే పాడైపోయింది. అయితే ఇటీవల ప్రభుత్వం అతడికి మూడు చక్రాల వాహనాన్ని అందించింది. ప్రస్తుతం ఆ వాహనం సహాయంతోనే అతడు స్విగ్గీ డెలివరీలు చేస్తున్నాడు.
![Karnataka handicapped man](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17733165_ww.jpg)