సేవ చేయాలన్న ఉద్దేశం ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా చేయవచ్చు అనేందుకు ఉదాహరణగా ఓ వృద్ధురాలు నిలిచారు. భిక్షాటన చేస్తూ జీవనం సాగించే ఆ యాచకురాలు కర్ణాటకలోని మంగళూరులో ఓ ఆలయానికి లక్ష రూపాయలు విరాళం అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఉడిపి జిల్లా కుందాపుర్ తాలూకాకు చెందిన అశ్వత్థమ్మ(80) చేసిన ఈ పనిని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇప్పటి వరకు పలు ఆలయాలకు సుమారు రూ.9 లక్షల విరాళంగా అందించానని ఆమె తెలిపారు.
మంగళూరు శివార్లలోని ముల్కిలోని బప్పనాడు శ్రీ దుర్గాపరమేశ్వరి ఆలయానికి వచ్చిన ఆమె అన్నదాన కార్యక్రమం కోసం లక్ష రూపాయలను విరాళంగా అందజేశారు. విరాళాన్ని స్వీకరించిన ఆలయ సిబ్బంది ఆమెకు ప్రసాదం అందజేసి సన్మానించారు. ఆమె ఇలా చేయడానికి వెనుక బలమైన కారణముందని తెలిపారు.
చాలా ఏళ్ల పాటు ఆలయాలు, టోల్‌గేట్లతో పాటు పలు ప్రాంతాల్లో భిక్షాటన చేసిన అశ్వత్థమ్మ అలా సేకరించిన సొమ్మును ఎన్నో ఆలయాలకు విరాళంగా అందజేశారు. 18 ఏళ్ల క్రితం భర్త అలాగే తన పిల్లలు మృతి చెందడం వల్ల భిక్షాటన చేయాల్సి వచ్చిందని తెలిపారు. అలా సాలిగ్రామలోని గురు నరసింహ దేవాలయం దగ్గర భిక్షాటన చేయడం ప్రారంభించారు. అలా వచ్చిన డబ్బును దాచిపెట్టి గుడి ఆవరణలోనే నివసించేవారు. ఆ డబ్బును ఆమె తొలిసారిగా గురు నరసింహ ఆలయానికి విరాళంగా ఇచ్చారు. తర్వాత అనేక దేవాలయాలకు ఇదే తరహాలో విరాళాలు అందజేశారు.
కొవిడ్ సమయంలోనూ అశ్వత్థమ్మ అయ్యప్ప మాలతో శబరిమల వెళ్లి అక్కడ అన్నదానానికి 1.5 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఆ తర్వాత గంగోల్లి ఆలయానికి లక్ష రూపాయలు, కంచుగోడు కుందాపుర్ ఆలయానికి లక్ష రూపాయలు, పొలలి శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో అన్నదానానికి లక్ష రూపాయలు, పొలలిలోని అఖిలేశ్వరి ఆలయానికి లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. ఇంత మందికి అన్నదాత అయినప్పటికీ ఆమె గుడి ప్రసాదం మాత్రమే తింటూ జీవనం సాగిస్తారని స్థానికులు తెలిపారు.
ఇదీ చదవండి: 'కశ్మీర్ దేశస్థులను ఏమని పిలుస్తారు?'.. ఏడో తరగతి ప్రశ్నాపత్రంపై దుమారం