ఝార్ఖండ్ లాతెహార్ జిల్లా (Latehar Jharkhand) బుక్రు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఓ కుంటలో పడి ఎనిమిది మంది మరణించారు. ఇందులో ఏడుగురు బాలికలు, యువతులే ఉన్నారు. వీరి వయసు 12 నుంచి 20 ఏళ్ల మధ్య ఉంటుందని అధికారులు తెలిపారు.
ఝార్ఖండ్‌లో ప్రత్యేకంగా నిర్వహించే 'కర్మ పూజ'ను (Karma puja 2021 Jharkhand) పూర్తి చేసుకున్న తర్వాత నిమజ్జనం కోసం కుంట దగ్గరికి వెళ్లి.. ప్రమాదవశాత్తు పడిపోయినట్లు లాతెహార్ జిల్లా (Latehar Jharkhand) డీసీపీ అబు ఇమ్రాన్ వెల్లడించారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారని చెప్పారు. సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయని వివరించారు. ఈ ప్రమాదంపై విచారణ చేపట్టాలని డిప్యూటీ డెవలప్మెంట్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
కాపాడేందుకు దిగి..
ప్రకృతిని ఆరాధిస్తూ ఈ పూజ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా కరమ్ చెట్టు కొమ్మలను పూజిస్తారు. వీటిని నిమజ్జనం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. పది మంది బాలికలు కుంట దగ్గరికి వెళ్లగా... ప్రమాదవశాత్తు ఇద్దరు కుంటలో పడిపోయారు. కాపాడమంటూ అరిచేసరికి.. మరో ఐదుగురు నీటిలోకి దిగారు. చివరకు వీరంతా అందులోనే మునిగిపోయారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
వీరి అరుపులను విని చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి బాలికలను బయటకు తీశారు. నలుగురు అక్కడికక్కడే మరణించినట్లు గుర్తించారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
మోదీ, కోవింద్ విచారం
ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారంవ్యక్తం చేశారు. యువతులు ప్రాణాలు కోల్పోయిన వార్త విని షాక్‌కు గురయ్యాయని చెప్పారు. బాధితుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సైతం ఈ ఘటనపై స్పందించారు. ఈ వార్త తనను బాధ కలిగించిందని చెప్పారు.
దీనిపై స్పందించిన ఝార్ఖండ్ సీఎం (Jharkhand CM) హేమంత్ సొరెన్ (Hemant Soren).. మృతుల ఆత్మలకు శాంతి కలగాలని ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: 'బుల్లెట్' విడిభాగాలతో 'ఈ-బైక్'- తొమ్మిదో తరగతి విద్యార్థి ఘనత