ఓ అత్యాచార బాధిత బాలిక.. ఎవరి సాయమూ తీసుకోకుండా, యూట్యూబ్ వీడియోలో చెప్పినట్టు ఇంట్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. బొడ్డుతాడు కూడా కత్తిరించుకుంది. కేరళలోని మలప్పురంలో ఈనెల 20న ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు.. తల్లీబిడ్డలను మంజేరిలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారు. బాలిక గర్భం దాల్చడానికి కారణమైన ఆమె ప్రియుడిని పోలీసులు పోక్సో చట్ట నిబంధనల కింద బుధవారం అరెస్టు చేశారు.
ఇదీ జరిగింది..
కొట్టికల్ ఠాణా పరిధిలో ఇంటర్మీడియట్ చదువుతున్న 17 ఏళ్ల బాలిక, 22 ఏళ్ల యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వారి పెళ్లికి అంగీకరించిన పెద్దలు, బాలికకు 18 ఏళ్లు నిండిన తర్వాత వివాహం చేయాలని నిశ్చయించారు. ఇంతలోనే గర్భవతి అయిన బాలిక విషయం తన తల్లిదండ్రులకు తెలియనివ్వలేదు. యూట్యూబ్ వీడియో సాయంతో సొంతంగా ఇంట్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ ఏడుపు వినపడటం వల్ల అసలు విషయం బయటకు వచ్చింది.
ఇదీ చూడండి : 'మద్యం తాగితే జైలు శిక్ష లేనప్పుడు.. డ్రగ్స్ తీసుకుంటే ఎందుకు?'