దివ్యాంగురాలైన 13 ఏళ్ల కూతురు జననాంగాల్లోకి రాడ్ చొప్పించి.. దారుణంగా అత్యాచారం చేసిన తండ్రికి 107 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది పోక్సో కోర్టు. నాలుగు లక్షల రూపాయల జరిమానా సైతం విధించింది. అవి చెల్లించలేకపోయినట్లయితే మరో ఐదేళ్లు అదనంగా శిక్ష అనుభవించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కేరళ పతనంతిట్ట జిల్లా జువైనల్ కోర్టు ఈ తీర్పు వెల్లడించింది.
కేసు వివరాల్లోకి వెళ్తే..
జిల్లాలోని కుంబజాకు చెందిన 13 ఏళ్ల దివ్యాంగ బాలికపై 45 ఏళ్ల తండ్రి పశువులా ప్రవర్తించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 2020లో జరిగిందీ ఘటన. అత్యాచారం చేయడమే కాకుండా బాలికను అతడు చిత్రహింసలకు గురిచేసేవాడు. ఈ బాధలు భరించలేని బాలిక... ఒకరోజు భయపడి పారిపోయి స్కూల్లో తలదాచుకుంది. తరువాతి రోజు పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు విషయంపై బాలికను ఆరా తీశారు. దీంతో తండ్రి అఘాయిత్యం గురించి ఉపాధ్యాయులకు వివరించింది బాలిక. అనంతరం చైల్డ్‌లైన్ కార్యకర్తలకు సమాచారం అందించారు ఉపాధ్యాయుడు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, కొన్నేళ్ల క్రితమే నిందితున్ని అతని భార్య వదిలేసి వెళ్లింది. బాలిక మాత్రం తండ్రితోనే ఉంటూ స్కూల్‌కు వెళ్తోంది. ఒంటరిగా ఉండే ఆమెపై ఈ దారుణాలకు ఒడిగట్టేవాడు తండ్రి. ఘటనపై విచారణ అనంతరం ఐపీసీ 376, పోక్సో చట్టంలోని 3, 4, 5, 6 సెక్షన్లతో పాటు జువైనల్ జస్టిస్ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద నిందితున్ని దోషిగా నిర్ధరించింది న్యాయస్థానం. విధించిన జరిమానా మొత్తాన్ని బాధితురాలికి పరిహారంగా అందజేయాలని సూచించింది.