MLC Balmoor Venkat On NEET Paper Issue : నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ప్రధాని మోదీ 24 లక్షల మంది విద్యార్థులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్సీ, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. నీట్ అభ్యర్థులకు అండగా ఉన్నామంటూ ఎన్‌ఎస్‌యూఐ సహా 12 విద్యార్థి సంఘాలు నారాయణగూడ నుంచి ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వరకు 'స్టూడెంట్ మార్చ్' పేరిట ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ప్రమోద్‌కుమార్ జోషీ ఉన్న చోట లీకేజీలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం మొండివైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించి, నీట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డిలు ఈ విషయంపై స్పందించకుంటే తెలంగాణలో తిరగనివ్వమని హెచ్చరించారు.