Rain Alert in Telangana : రాష్ట్రంలో రాగల మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శని, ఆదివారాల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, సోమవారం అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఈ మూడు రోజులు కూడా ఉరుములు మెరుపులతో కూడిన గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.
ఆవర్తనం ఒకటి ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో ఏర్పడిందని ఐఎండీ సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి గాలులు ప్రధానంగా పశ్చిమ, నైరుతి దిశల నుంచి వీస్తున్నాయని సంచాలకులు తెలిపారు.