Suicide By Drinking Pesticides : ఆన్లైన్ బెట్టింగ్లలో డబ్బులు నష్టపోయిన ఓ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం రుద్రారం గ్రామంలో చోటుచేసుకుంది. రుద్రారం గ్రామంలో ఈదారి నవీన్ (27) అనే వ్యక్తి వ్యవసాయ సంబంధిత ఎరువులను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఆన్లైన్ బెట్టింగులకు అలవాటు పడ్డాడు. బెట్టింగులకు బానిసైన నవీన్ అప్పుల ఊబిలో కూరుకుపోయాడు.
అప్పులు తీర్చే మార్గం కానరాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన నవీన్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య రాధికతో పాటు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.