Port Blair As Sri Vijaya Puram: అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును 'శ్రీవిజయపురం' గా కేంద్రం సవరించింది. ఈ మేరకు కేంద్ర హోంఖ మంత్రి అమిత్ షా సామాజికమాధ్యమం ఎక్స్ ద్వారా ప్రకటన చేశారు. పోర్ట్‌బ్లెయిర్ అనేది వలసరాజ్య పోకడలకు చిహ్నమని, ఆ ముద్రను తొలగించటమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. శ్రీవిజయపురం స్వాతంత్య్ర సంగ్రామంలో విజయానికి గుర్తు అని అమిత్‌షా పేర్కొన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో అండమాన్ నికోబార్ దీవులకు అసమాన పాత్ర ఉందన్నారు.
చోళ సామ్రాజ్యంలో అండమాన్ నికోబార్ దీవులు నౌకాస్థావరంగా ఉండేవని, ఇప్పుడు దేశ వ్యూహాత్మక, అభివృద్ధి ఆకాంక్షలకు కీలకమైన పునాది అని అమిత్ షా తెలిపారు. నేతాజి సుభాష్‌చంద్రబోస్ తొలిసారి మువ్వన్నెల జెండాను అక్కడే ఎగురవేసినట్లు చెప్పారు. వీర సావర్కర్‌తోపాటు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటంచేసిన ఎంతోమంది నేతలను బంధించిన సెల్యులార్ జైలు ఇక్కడే ఉందని అమిత్ షా గుర్తుచేశారు.