Delhi HC On Jagadish Tytler Case : దేశ రాజధానిలో 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి పుల్ బంగశ్ హత్యల కేసులో దిల్లీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్‌పై హత్యతోపాటు ఇతర నేరాలకు సంబంధించిన అభియోగాలు మోపాలని ఆదేశించింది. అభియోగాలు మోపేందుకు తగిన ఆధారాలున్నాయని స్పష్టం చేసింది. టైట్లర్‌ను విచారించేందుకు తగిన సాక్ష్యాలు ఉన్నాయని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి రాకేశ్ సియాల్ తెలిపారు.
"1984 నవంబరు 1న టైట్లర్ తన కారు నుంచి దిగి అల్లరిమూకలను రెచ్చగొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వారిని చంపేసి తర్వాత వారి దుకాణాలను లూటీ చేయాలని ఆయన ప్రేరేపించినట్లు సాక్షులు పేర్కొన్నారు. ఫలితంగా అల్లరిమూకలు పుల్ బంగశ్ గురుద్వారాకు నిప్పుపెట్టారు. ఆ తర్వాత ముగ్గురు సిక్కు వ్యక్తులను చంపేశారు" అని సీబీఐ గతంలో తమ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఇప్పుడు అభియోగాలు మోపాలని కోర్టు ఆదేశించింది.