ఆసరా చెక్కుల పంపిణీలో రసాభాస - వైసీపీ ఇంఛార్జిని నిలదీసిన మహిళలు
🎬 Watch Now: Feature Video
Womens Fire on YCP Leader in Yerragondapalem : ప్రకాశం జిల్లాలో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. జిల్లాలోని పెద్దారవీడు మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యర్రగొండపాలెం వైసీపీ ఇన్‌ఛార్జి తాడిపత్రి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చంద్రశేఖర్ ప్రంసంగాన్ని ముగించిన తరువాత చెక్కుల పంపిణీ చేశారు. ఆ తర్వాత పలు గ్రామాలకు చెందిన మహిళలు ఒక్కసారిగా వేదిక వద్దకు దూసుకువచ్చారు. తమ గ్రామాల్లో తాగు నీటి సమస్య అధికంగా ఉందని తాడిపత్రి చంద్రశేఖర్‌ను నిలదీశారు. దీనిపై ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
అనంతరం చంద్రశేఖర్ కలుగజేసుకొని, నీటి సమస్య ఉన్న గ్రామాల పేర్లు, వాటి సర్పంచ్ పేర్లను రాసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులను చుట్టుమట్టిన మహిళలు వారి సమస్యలను తెలిపారు. అదేవిధంగా వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు ఆర్ అండ్ ఆర్ ప్రాకేజి సంగతి ఏంటని ప్రశ్నించారు. తప్పకుండా నిర్వాసితుల ఖాతాల్లో నగదు జమ చేసిన తరువాతే ముఖ్యమంత్రి ప్రాజెక్టును ప్రారంభిస్తారని తాడిపత్రి చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. మహిళలు నిరసనలతో కార్యక్రమం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.