మద్యం సేవించి పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయుడు - గదిలో బంధించిన తల్లిదండ్రులు - Students Lock Up Teacher In Room - STUDENTS LOCK UP TEACHER IN ROOM
🎬 Watch Now: Feature Video


Published : Mar 27, 2024, 5:21 PM IST
Students Parents Lock Up Teacher In Room : పాఠశాలకు మద్యం సేవించి వస్తున్నాడని ఓ ఉపాధ్యాయున్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గదిలో తాళం వేసి బంధించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే ఈ విధంగా ప్రవర్తించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సమాచారమందుకున్న విద్యాశాఖ అధికారి ఈ వ్యవహారంపై విచారణ నిమిత్తం ఓ ఉపాధ్యాయుడిని పాఠశాలకు పంపారు. ఆయన విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేస్తామని హామీ ఇవ్వడంతో ఉపాధ్యాయుడిని విడుదల చేశారు.
ఇదీ జరిగింది
చర్ల మండలంలోని జిపి పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో కృష్ణ అనే వ్యక్తి ఇన్ఛార్జ్ హెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆయన రోజూ మద్యం సేవించి పాఠశాలకు రావడమే కాకుండా తమ పిల్లలను కొడుతున్నాడని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆ ఉపాధ్యాయుడిని ఓ గదిలో బంధించి తాళం వేశారు. ఉపాధ్యాయుడు ఇవాళ కూడా మద్యం సేవించి వచ్చాడని తల్లిదండ్రులు ఆరోపించారు.
అయితే ఉపాధ్యాయుడు వ్యక్తిగత సమస్యల కారణంగా పాఠశాలకు తాగి వస్తున్నానని ఓసారి, అసలు మద్యం సేవించేలేదని భిన్నమైన సమాధానాలు చెబుతున్నాడు. పై అధికారులకు ఈ విషయం తెలిసినా తనకు ఏమీ కాదని మద్యం మత్తులో ఉపాధ్యాయుడు కృష్ణ చెప్పినట్లుగా విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ఈ తాగుబోతు టీచర్ ఉంటే తమ పిల్లలను పాఠశాలకు పంపించమని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న మండల విద్యాశాఖాధికారి విచారణ నిమిత్తం పాఠశాలకు ఓ ఉపాధ్యాయుడిని పంపించారు. ఆయన విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. ఉపాధ్యాయుడిని విడుదల చేశారు.