ప్రతి పోలింగ్ బూత్‌లో బ్రీత్ ఎనలైజర్లు ఏర్పాటు కోరుతూ - హైకోర్టులో పిల్ దాఖలు - సార్వత్రిక ఎన్నికలు 2024
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 27, 2024, 12:28 PM IST
Breath Analyzers in Polling Booth: సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్ వద్ద బ్రీత్ ఎనలైజర్లు ఏర్పాటు చేసేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. మద్యానికి ప్రభావితం కానివారిని ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని కోరుతూ జనవాహిని పార్టీ కార్యదర్శి ఎం. శివరామ్ సుందర్ ఈ పిల్‌ను దాఖలు చేశారు.
పిటిషనర్ తరఫున న్యాయవాది డీఎస్‌ఎన్వీ ప్రసాదబాబు తమ వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని న్యాయస్థానాన్ని కోరారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 16 ప్రకారం అన్ సౌండ్ మైండ్‌తో ఉన్నవారు ఓటు హక్కుకు అనర్హులన్నారు. పరిమితికి మించి మద్యం సేవించినవారు అన్ సౌండ్ మైండ్ కిందకు వస్తారని పిటిషనర్ తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ప్రతి పోలింగ్ బూత్ వద్ద బ్రీత్ ఎనలైజర్లు ఏర్పాటు చేసేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ మద్యం సేవించినవారు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 16 కిందకు ఎలా వస్తారని ప్రశ్నించింది.
18 ఏళ్లు దాటినవారికి ఓటు హక్కు కల్పిస్తున్నారని తెలిపింది. నిర్ధిష్ట వయసు లేనివారికి మద్యాన్ని విక్రయించడంపై నిషేధం ఉందని గుర్తు చేసింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ప్రసాదబాబు బదులిస్తూ పరిమితికి మించి మద్యం సేవించి వాహనం నడిపితే మోటారు వాహనాల చట్టం ప్రకారం నేరం అన్నారు. ఓటు ద్వారా రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే అర్హతను మద్యం సేవించిన వారికి ఉండకూడదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ దీనిపై తదుపరి విచారణను బుధవారం విచారణ చేపడ్తామని తెలిపింది. బూత్‌ల వద్ద బ్రీత్ ఎనలైజర్లు ఏర్పాటుకు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 16 ఏవిధంగా వర్తిస్తుందో కోర్టును సంతృప్తి పరచాలని స్పష్టం చేసింది.