శంషాబాద్ విమానాశ్రయంలో మహిళా ప్రయాణికురాలి నుంచి భారీగా హెరాయిన్ పట్టివేత - విలువ తెలిస్తే షాక్!
🎬 Watch Now: Feature Video
Officials Caught Heroin at Shamshabad Airport : హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో మత్తు పదార్థాల అక్రమ రవాణా రోజురోజుకూ పెరుగుతోంది. గత కొద్దికాలంగా అక్రమంగా బంగారం, డ్రగ్స్ తీసుకువెళ్తూ పలువురు నిందితులు పట్టుబడుతున్నారు. వీరిలో మహిళలు కూడా ఉంటున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా దేశానికి చెందిన ఓ మహిళ హెరాయిన్ తరలిస్తూ అధికారులకు చిక్కింది. కస్టమ్ అధికారులు(Custam Officials Caught Drugs from SA Woman) తెలిపిన వివరాల ప్రకారం, దక్షిణాఫ్రికా దేశానికి చెందిన మహిళా ప్రయాణికురాలి నుంచి రూ.41 కోట్లు విలువ చేసే 5.92 కిలోల హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మహిళ లుసాకా, జాంబియా దేశం నుంచి హైదరాబాద్ వచ్చినట్లు తెలిపారు. నిందితురాలిని అరెస్ట్ చేసిన అధికారులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
Bomb Threat Call to Hyderabad Airport : మరోవైపు శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం విమానాశ్రయానికి ఓ ఆగంతకుడు జీఎంఆర్ కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేసి బాంబు ఉందని బెదిరించాడు. వెంటనే ఆర్జీఐ పోలీసులకు జీఎంఆర్ సిబ్బంది సమాచారమిచ్చారు. అధికారులు వెంటనే స్పందించి దర్యాప్తు చేపట్టగా, ముంబయికి చెందిన వ్యక్తి ఫోన్ చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.