ఓఆర్ఆర్పై ఆగి ఉన్న బొగ్గు లారీని వెనక నుంచి ఢీకొట్టిన కారు - ఒకరి సజీవదహనం - Outer Ring Road Accident - OUTER RING ROAD ACCIDENT
🎬 Watch Now: Feature Video


Published : Apr 25, 2024, 6:34 PM IST
Man Died in Car Accident at ORR : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివారులో ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న బొగ్గు లోడ్ లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో ఒక్కసారిగా కారులో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో లారీ డ్రైవర్ వెంటనే గమనించి కిందకు దిగిపోగా, కారులో ఉన్న వ్యక్తి మాత్రం మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. బొగ్గు కారులో పడి మంటలు చెలరేగడంతో అందులో ఎంతమంది ప్రయాణిస్తున్నారనేది మొదట తెలియలేదు. చివరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
అనంతరం జేసీబీల సహాయంతో లారీని ముందుకు జరిపి కారును బయటకు తీయడంతో సజీవ దహనమైన ఒక మృతదేహం బయటపడింది. కారులో సజీవ దహనమైన వ్యక్తి బీరంగూడకు చెందిన శిరీశ్ అనే వ్యాపారిగా పోలీసులు గుర్తించారు. మాదాపూర్లో ఉన్న తన వ్యాపారం చూసుకుని ఉదయం సమయంలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ మేరకు పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.