'కాపుల అజెండా మేనిఫెస్టోలో పెట్టిన పార్టీకే మద్దతిస్తాం'
🎬 Watch Now: Feature Video
Kapu Leaders Meeting in Vijayawada : కాపుల అజెండాను మేనిఫెస్టోలో పెట్టిన పార్టీకే తమ మద్దతు ఉంటుందని కాపు సామాజిక వర్గ నేతలు స్పష్టం చేశారు. కాపుల జాగృతి ఆధ్వర్యంలో విజయవాడలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు నేతలు పాల్గొన్నారు. 30 ఏళ్లుగా కాపుల డిమాండ్ల సాధన కోసం ఉద్యమం కొనసాగుతోందని దామాషా ప్రకారం రాజకీయ పార్టీలు ప్రాధాన్యం ఇవ్వాలని తమిళనాడు మాజీ సీఎస్, కాపు నేత రామ్మోహనరావు అన్నారు. అన్ని జిల్లాల్లో కాపు సంక్షేమ భవనాలు నిర్మించాలన్నారు. కాపుల్లో సహజ నాయకత్వం ఉన్నవారిని గుర్తించి వారికి అవకాశం ఇవ్వాలన్నారు.
ప్రభుత్వాలు మారుతున్నప్పుడల్లా కాపు రిజర్వేషన్లపై ప్రభావం పడుతుందన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా కాపులకు 43 అసెంబ్లీ, 7 పార్లమెంట్ స్థానాలివ్వాలని డిమాండ్ చేశారు. రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. కులాల వారీగా కులగణన జరిపి కాపులకు సరైన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కాపు, తెలగ, బలిజ కులాలకు 10% రిజర్వేషన్లు కల్పించాలని, కాపులకు ప్రత్యేకంగా బడ్జెట్ పెట్టాలని డిమాండ్ చేశారు. కృష్ణదేవరాయలు, వంగవీటి మోహన్ రంగా వంటి కాపు ప్రముఖుల పేర్లు జిల్లాలకు పెట్టాలని కోరారు.